పోర్ట్‌ స్టేడియం లీజులో రూ.40 కోట్ల కుంభకోణం | - | Sakshi
Sakshi News home page

పోర్ట్‌ స్టేడియం లీజులో రూ.40 కోట్ల కుంభకోణం

May 13 2026 1:38 AM | Updated on May 13 2026 1:38 AM

జనసేన నేత పీతల మూర్తి యాదవ్‌

బీచ్‌రోడ్డు: విశాఖ పోర్ట్‌ స్టేడియం లీజును తీసుకున్న ‘విశ్వనాథ్‌ స్పోర్ట్స్‌ అండ్‌ కన్వెన్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’సంస్థకు, థర్డ్‌ పార్టీ అసెస్‌మెంట్‌ పేరిట రూ.40 కోట్లు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని జనసేన మాజీ కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ ఆరోపించారు. మంగళవారం నగరంలోని ఓ హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో సహకరిస్తున్న విశాఖ పోర్ట్‌ అధికారులపై సీబీఐ, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌, కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖలు తక్షణమే విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సదరు సంస్థకు ఎటువంటి చెల్లింపులు చేయకూడదని, ప్రస్తుతం బదిలీపై వెళ్తున్న చైర్మన్‌ అంగముత్తు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని మూర్తి యాదవ్‌ పేర్కొన్నారు. రూ.40 కోట్ల పోర్ట్‌ ధనాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు అధికారు లు అత్యుత్సాహం చూపుతున్నారని ఆరోపించారు. వాస్తవానికి, తమకు రూ.48 కోట్ల పరిహారం చెల్లించాలంటూ విశ్వనాథ్‌ సంస్థ ఫిబ్రవరి 2న చీఫ్‌ ఇంజినీర్‌కు లేఖ రాసిందని.. దీని ఆధారంగా కోర్టు తీర్పులకు విరుద్ధంగా, థర్డ్‌ పార్టీ అసెస్‌మెంట్‌ పేరిట అక్రమ మార్గంలో కోట్లు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తొలుత ఉన్న అంచనాలను కాదని, నష్టపరిహారం తక్కువగా ఉందనే నెపంతో కోల్‌కతాకు చెందిన ‘మెకాన్‌’అనే సంస్థకు తిరిగి అంచనాల బాధ్యత అప్పగించారని దుయ్యబట్టారు. పాత అంచనాల కంటే కనీసం 50 శాతం అదనంగా అంచనాలను పెంచాలని సదరు సంస్థకు లోపాయికారీగా ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. విశ్వనాథ్‌ సంస్థపై ప్రస్తుత చైర్మన్‌ అంగముత్తు గతంలో చర్యలు తీసుకుని లీజు ఒప్పందాన్ని రద్దు చేశారని, అయితే ఆయన బదిలీ కావడంతో ప్రస్తుతం ఇన్‌చార్జి చైర్మన్‌గా కొనసాగుతున్నారని మూర్తి యాదవ్‌ తెలిపారు. కొత్త చైర్మన్‌గా జస్మిత్‌ సింగ్‌ బింద్రా ఆదివారమే నియమితులైనందున, ఆయన బాధ్యతలు స్వీకరించే వరకు అంగముత్తు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement