సబ్బవరం: భారతీయ పెట్రోలియం అండ్ శక్తి సంస్థ(ఐఐపీఈ) ఆరో స్నాతకోత్సవాన్ని ఈ నెల 14న వంగలిలోని శాశ్వత క్యాంపస్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం వర్సిటీలో విలేకరుల సమావేశంలో ఐఐపీఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షుడు ఆచార్య పి.కె.బానిక్ వివరాలు వెల్లడించారు. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వి.కె.సరస్వత్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు అందజేస్తారు. ఈ ఏడాది మొత్తం 114 మంది విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు. వీరిలో 97 మంది బీటెక్, 15 మంది పీజీ, ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులు ఉన్నారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్, గోల్డ్, సిల్వర్ మెడల్స్‌తో పాటు ప్రత్యేక పురస్కారాలు ప్రదానం చేస్తారు. 2025–26 విద్యా సంవత్సరంలో బీటెక్‌లో 84.82 శాతం ప్లేస్‌మెంట్స్ నమోదయ్యాయి. కెమికల్ ఇంజనీరింగ్‌లో అత్యధికంగా రూ.17.90 లక్షలు, పెట్రోలియం ఇంజనీరింగ్‌లో రూ.16.22 లక్షల వార్షిక వేతనం లభించింది. తొలిసారిగా సొంత శాశ్వత క్యాంపస్‌లో స్నాతకోత్సవం నిర్వహించడం గర్వకారణమని ఆచార్య బానిక్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో 601 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఐఐపీఈ డైరెక్టర్ ఆచార్య శాలివాహన్, అసోసియేట్ డీన్ హిమాంగ్షు కాకతి, రిజిస్ట్రార్ రామ్‌ఫల్ ద్వివేది పాల్గొన్నారు.


