మహారాణిపేట: సమస్య చిన్నదైనా దానికి పరిష్కారం లభించడం లేదు. ఫలితంగా అదే సమస్యపై పదే పదే అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)పై జనం పెదవి విరుస్తున్నారు. మండల కేంద్రాల్లో తమ గోడు పట్టించుకోకపోవడంతో జిల్లా కేంద్రానికి వచ్చినా.. ఇక్కడ కూడా అదే తంతు కొనసాగుతోందని బాధితులు మండిపడుతున్నారు. ముఖ్యంగా భూ వివాదాలు, ఉపాధి, సంక్షేమ పథకాలు, ఆదాయ ధ్రువపత్రాలు, గృహ స్థలాలు, తాగునీరు, పింఛన్లు వంటి సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. విన్నవించుకున్న 15 రోజుల్లో పరిష్కారం లభించకపోవడంతో బాధితులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు ప్రజలు వివిధ సమస్యలపై మొత్తం 348 వినతులు సమర్పించారు. వాటిలో రెవెన్యూ విభాగానికి 35, జీవీఎంసీకి 76, పోలీస్ శాఖకు 27, ఇతర విభాగాలకు సంబంధించి 210 వినతులు ఉన్నాయి.
ఫిర్యాదులు రీ–ఓపెన్ కాకూడదు: కలెక్టర్
పీజీఆర్‌ఎస్ ద్వారా ప్రజల నుంచి వచ్చే వినతులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు మళ్లీ రీ–ఓపెన్ కాకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత విభాగాధిపతులదేనని స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన సమీక్ష నిర్వహించారు. సమస్యకు సరైన పరిష్కారంతో పాటు సంబంధిత ఎండార్స్‌మెంట్‌ను కూడా తప్పనిసరిగా ఫిర్యాదుదారులకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో ఎం.విశ్వేశ్వర నాయుడు, ఏడీసీ సత్యవేణి పాల్గొన్నారు. రెవెన్యూ క్లినిక్‌లో ఆర్డీవోలు, తహసీల్దార్లు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.


