మహారాణిపేట : జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలపాలని, దానికి ప్రత్యేక కార్యాచరణ, విజన్‌తో కూడిన కృషి అవసరమని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చర్చించిన అంశాలు, ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యతలు, అమలు చేయాల్సిన కార్యాచరణపై సోమవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేపీఐ, పబ్లిక్ పర్సెప్షన్, పీజీఆర్‌ఎస్, స్వర్ణవార్డు–స్వర్ణగ్రామ సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, జిల్లా, నియోజకవర్గాల వారీగా పబ్లిక్ పర్సెప్షన్ వివరాలను విశ్లేషించాలని తెలిపారు. పీజీఆర్‌ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఫిర్యాదుపై జిల్లా స్థాయి అధికారులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. వ్యవసాయం, వైద్యం, గృహనిర్మాణం, సంక్షేమం, ఇరిగేషన్ తదితర రంగాల్లో నాణ్యమైన సేవలు అందించాలని పేర్కొన్నారు. గంగవరం పోర్టు రహదారి నిర్మాణంలో అధికారులు చొరవ చూపాలని చెప్పారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో స్పెషల్ ఆఫీసర్లు భాగస్వామ్యం కావాలని, స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. పబ్లిక్ పర్సెప్షన్‌లో రాష్ట్రంలో జిల్లా ద్వితీయ స్థానంలో ఉండటం హర్షణీయమని, అదే ఉత్సాహంతో అన్ని రంగాల్లో విశాఖను నంబర్–1గా నిలపాలని పిలుపునిచ్చారు. కౌశలం, కుసు మ్, సంజీవని పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలని, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, కొత్త ప్రా జెక్టుల గుర్తింపు, యారాడ బీచ్ వద్ద పర్యాటక ప్రా జె క్టులు, ఎకనామిక్ టౌన్‌షిప్‌ల ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించాలని సూచించారు. జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో ఎం.విశ్వేశ్వర నాయుడు పాల్గొన్నారు.


