సాక్షి, విశాఖపట్నం : మేజర్ పోర్టులతో పోటీపడుతూ 100 మిలియన్ టన్నుల హ్యాండ్లింగ్ లక్ష్యంతో పాటు.. కాలుష్య రహిత పోర్టుగా మార్చడమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తున్నామని విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ డా.అంగముత్తు స్పష్టం చేశారు. పోర్టు పరిధిలో పలు కీలక మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభంతో పాటు కొత్త ప్రాజెక్టులకు సోమవారం శంకుస్థాపనలు చేశారు. పబ్లిక్ ప్రొమెనెడ్ అభివృద్ధి, పోర్టు నిర్వహణ వ్యవస్థ, 38 టీకేఎం రైల్వే ట్రాక్‌ల విద్యుదీకరణ, పరిపాలన భవనంలోని డిస్‌ప్లే కారిడార్, ఎస్‌టీపీ సమీపంలో 170 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ, ప్రస్తుత ఎంసీహెచ్‌వీ రైల్వే ట్రాక్ అప్‌గ్రెడేషన్, ఎస్‌ఎల్ కాలువ జెట్టీ సమీపంలో మరమ్మతులు, రైల్వే ట్రాక్‌ల్లో మలుపుల సవరణతో మెరుగుదల పనులతో పాటు కస్టమ్స్ సరిహద్దు గోడ నిర్మాణాన్ని చైర్మన్ డా.అంగముత్తు ప్రారంభించారు. భద్రత, మౌలిక సదుపాయాల బలోపేతానికి సంబంధించిన పలు ముఖ్యమైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. వీటిలో అన్ని గేట్ల వద్ద అండర్ వెహికల్ స్కానింగ్ సిస్టమ్‌ల ఏర్పాటు, కార్గో గేట్ల వద్ద రేడియోలాజికల్ డిటెక్షన్ పరికరాల ఏర్పాటు, కాన్వెంట్ జంక్షన్ ఆర్చ్ నుంచి హెచ్–7 జంక్షన్ వరకు బీటీ రోడ్డుకు రీగ్రేడింగ్ పనులు, ఓహెచ్‌సీ లోపలి రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.


