ఇంటి గ్యాస్‌తో
మహారాణిపేట: నగరంలో వంట గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా పడగ విప్పింది. గృహ అవసరాల కోసం కేటాయించిన సిలిండర్లు బహిరంగంగానే పక్కదారి పడుతున్నాయి. అంతర్జాతీయ యుద్ధ వాతావరణాన్ని సాకుగా చూపుతూ, నగరంలోని బ్లాక్ మార్కెట్ వ్యాపారులు అక్రమ విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు. వాణిజ్య సిలిండర్ల ధరలు ఒక్కసారిగా పెరగడం, వాటి లభ్యతపై ఆంక్షలు ఉండటంతో వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు.
ధరల పెరుగుదలే కారణం
గత నెలలో రూ.2,165 ఉన్న వాణిజ్య సిలిండర్ ధర ప్రస్తుతం రూ.3,146.50కు చేరింది. వెయ్యి రూపాయల మేర భారం పెరగడంతో చిన్న, పెద్ద వ్యాపార సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు లాభాల కోసం గృహ అవసరాలకు వాడే సిలిండర్లపై ఆధారపడుతున్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొంత మంది గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, డెలివరీ బాయ్స్ కుమ్మకై ్క సామాన్యుడి పొయ్యి కింద సెగ పెడుతున్నారు. అదనపు సొమ్ము ఇస్తే చాలు, నిబంధనలతో సంబంధం లేకుండా సిలిండర్లను సరఫరా చేస్తున్నారు.
ఓటీపీ విధానానికి తూట్లు
అసలు ధర కంటే రూ.800 నుంచి రూ.1,000 వరకు అదనంగా వసూలు చేస్తూ గృహ సిలిండర్లను హోటళ్లకు మళ్లిస్తున్నారు. భద్రత కోసం ప్రవేశపెట్టిన ఓటీపీ విధానాన్ని ఇక్కడ పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. అధిక మొత్తంలో డబ్బులిస్తే ఓటీపీ అవసరం లేకుండానే సిలిండర్లు ఇస్తున్నారు. దీని వల్ల సాధారణ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకున్నా, మొబైల్‌కు ఓటీపీ వచ్చినా 15 రోజులైనా సిలిండర్ చేతికి అందడం లేదు. తమ సిలిండర్ ఎప్పుడు వస్తుందో తెలియక వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
పెరిగిన ఆహార ధరలు
ఈ విషయంపై వినియోగదారులు నిలదీస్తే.. అంతా డెలివరీ బాయ్స్ చేస్తున్న పనేనని ఏజెన్సీలు తప్పించుకుంటున్నాయి. ఈ కృత్రిమ కొరత వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు గ్యాస్ ధరల పెరుగుదలను సాకుగా చూపి హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ఆహార పదార్థాల ధరలను భారీగా పెంచేశారు. దీంతో సామాన్యులు అటు గ్యాస్ దొరక్క, ఇటు బయట తినలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతగా బహిరంగ దందా సాగుతున్నా సివిల్ సప్లైస్, విజిలెన్స్ శాఖల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రారంభంలో కొన్ని దాడులు చేసినా, ఆ తర్వాత నిఘా పూర్తిగా నిద్రపోతోంది. ఫలితంగా రోడ్ల మీద గృహ సిలిండర్లు పెట్టి విక్రయించే ఆహార వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి, గ్యాస్ ఏజెన్సీల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఓటీపీ విధానం సక్రమంగా అమలయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.


