మహారాణిపేట: వార్డుల విభజనలో తప్పిదాలు లేకుండా చూడాలని, ఓటరు జాబితాలను వెంటనే సరి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఆయన కలెక్టర్ అభిషిక్త్ కిశోర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 19 నుంచి వార్డుల విభజన ప్రక్రియ చేపడుతున్నారని, అందులోని లోపాలను సరిచేసి, ఓటరు జాబితాను పునర్వ్యవస్థీకరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందన్నారు. వార్డుల సంఖ్య పెరిగి, అవి చిన్నవిగా ఉంటేనే పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని, అప్పుడే ప్రజలకు సుపరిపాలన అందుతుందని పేర్కొన్నారు. జిల్లా జనతా వారధి కన్వీనర్ పి.శ్రీనివాసరావు, కో–కన్వీనర్ మూల వెంకట్రావు, నాయకులు దేవర చంద్రశేఖర్, నరసింగరావు, కె.రవిరాజ్, తిప్పనబోయిన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


