మహారాణిపేట: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కార్యదర్శి ఉమ్మడి నితిన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ కాలేదన్నారు. దీంతో అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉందని, ఫీజులు చెల్లించలేదనే కారణంతో కొన్ని కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, సర్క్యులర్లను కూడా కొన్ని కళాశాలలు పట్టించుకోవడంలేదన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యార్థుల సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ.5,800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్‌ల ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


