ఏసీబీకి చిక్కిన వీఆర్వో | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

May 12 2026 1:26 AM | Updated on May 12 2026 1:26 AM

● నక్కపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో మ్యూటేషన్‌కు రూ.2 లక్షలు డిమాండ్‌ ● రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్వో చిట్టిబాబు

నక్కపల్లి : రైతుకు చెందిన భూమిని మ్యూటేషన్‌ చేసేందుకు రూ.1.50 లక్షలు తీసుకుంటూ నక్కపల్లి మండలం పెదతీనార్ల వీఆర్వో కొప్పిశెట్టి చిట్టిబాబు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కశింకోట మండలం వెదురుపర్తి గ్రామానికి చెందిన ముక్కా శ్రీను అనే రైతు నక్కపల్లి మండలం పెదతీనార్లలో రెండు వేర్వేరు సర్వే నంబర్లలో 5.57 ఎకరాల భూమిని 2023లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఈ భూమిలో కొబ్బరి పంట వేసి సాగు చేసుకుంటున్నాడు.

మ్యూటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒక సర్వే నంబరుకు సంబంధించి 2.14 ఎకరాలకు భూమికి మ్యూటేషన్‌ జరిగింది. 3.43 ఎకరాల భూమి మ్యూటేషన్‌ జరగలేదు..రికార్డుల్లో కొనుగోలు చేసిన వ్యక్తి, అమ్మిన వ్యక్తి పేరు లేదు. వేరొక అసామి పేరున నమోదయి ఉంది. బాధితుడు కొనుగోలు చేసిన భూమిలో 2.14 ఎకరాల భూమిని ప్రభుత్వం బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కోసం సేకరించింది. ఈ భూమి మాత్రమే బాధితుడి పేరున రికార్డుల్లో మ్యూటేషన్‌ అయి నమోదై ఉండడంతో దానికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారు. మిగిలిన భూమికి నష్టపరిహారం ఇవ్వలేదు. దీంతో మిగిలిన భూమిని మ్యూటేషన్‌ చేయాలని రెవెన్యూ అదికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అధికారులు మాత్రం సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో బాధితుడు శ్రీను వీఆర్వో కొప్పిశెట్టి చిట్టిబాబును సంప్రదించగా, మ్యుటేసన్‌కు రూ.లక్షల్లో మామూళ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అడ్వాన్సుగా రూ.1.50 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం బాధితుడు ఈనెల7వ తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అడ్వాన్సు రూ.1.50 లక్షలు సోమవారం విశాఖపట్నం ఎయిర్‌పోర్టు సమీపంలో వీఆర్వోకు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నాయకత్వంలో సిబ్బంది వలవేసి పట్టుకున్నారు. అక్కడ నుంచి నిందితుడిని నక్కపల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకొచ్చి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. వీఆర్వో సొంత గ్రామం నక్కపల్లి మండలం ఉపమాకలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పట్టుబడ్డ వీఆర్వోపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement