వైద్యం | - | Sakshi
Sakshi News home page

వైద్యం

May 11 2026 9:55 AM | Updated on May 11 2026 9:55 AM

పడకేసిన
యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీల్లో అందుబాటులో లేని వైద్యులు వైద్యుల అవతారం ఎత్తుతున్న నర్సులు, ఫార్మసిస్టులు కానరాని స్పెషలిస్ట్‌ వైద్యులు 66 యూపీహెచ్‌సీలు, 9 పీహెచ్‌ిసీల్లో అరకొర సౌకర్యాలు

కొబ్బరితోట యూపీహెచ్‌సీలో వైద్యురాలిగా అవతారం ఎత్తిన నర్సు

మహారాణిపేట: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వ వైద్యం నేడు పడకేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే ఒకప్పుడు పేదవాడికి ప్రాణవాయువులా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితులు తలకిందులయ్యాయి. నాడి పట్టి చూసే నాథుడే కరువవ్వడంతో, సామాన్యుడు దవాఖానా మెట్లు ఎక్కాలంటేనే వణికిపోతున్నాడు. పర్యవేక్షణ లోపం, పాలకుల నిర్లక్ష్యం వెరసి ప్రభుత్వ వైద్య రంగం ప్రతిష్ట రోజురోజుకూ మసకబారుతోంది.

వైద్యులు లేని దవాఖానాలు..

వెలవెలబోతున్న వార్డులు

ఒకప్పుడు రోగులతో కళకళలాడే పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు నేడు వెలవెలబోతున్నాయి. దీనికి ప్రధాన కారణం వైద్యులు అందుబాటులో లేకపోవడమే. విధి నిర్వహణలో ఉండాల్సిన డాక్టర్లు ఆస్పత్రులకు రాకపోవడంతో రోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రోగితో వచ్చే వారు గంటల తరబడి వేచి చూసినా, డాక్టర్‌ దర్శనం కలగానే మిగులుతోంది. దీంతో ‘సర్కారు దవాఖానాకు పోతే టైం వేస్ట్‌’ అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోతోంది.

మందుల కొరత

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మందుల కొరత తీవ్రస్థాయికి చేరింది. గతంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులకు నెలరోజులకు సరిపడా మందులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు స్టాకు లేదనే నెపంతో కేవలం వారం రోజులకు మాత్రమే ఇస్తుండటంతో సామాన్యులు ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. డాక్టర్లు రాసిచ్చిన మందులు ఆస్పత్రిలో దొరక్కపోవడంతో పేద రోగులు బయట కొనుగోలు చేయలేక, వ్యాధి నయం కాక తీవ్ర అవస్థలు పడుతున్నారు.

అటకెక్కిన సేవలు

ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సేవలు అటకెక్కినట్లు కనిపిస్తున్నా, పాలకులు, ఆరోగ్య శాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఓపీ సేవల దగ్గర నుంచి అత్యవసర మందుల వరకు ప్రతిచోటా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అడిగే నాథుడే లేకపోవడంతో ప్రభుత్వ వైద్య రంగం ప్రతిష్ట మసకబారుతోంది. ఇప్పటికై నా సర్కార్‌ స్పందించి, మందుల కొరతను తీర్చి, వైద్యులు విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోకపోతే పేదవాడికి ప్రాణరక్షణ కరువయ్యే ప్రమాదం ఉంది.

ఖాళీల భర్తీలో

ప్రభుత్వం విఫలం

ఆస్పత్రుల్లో బదిలీల వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉన్న వైద్యులలో కొందరు ఆస్పత్రికి వచ్చి కేవలం ముఖ గుర్తింపు హాజరు వేసి, ఆపై తమ వ్యక్తిగత పనులకు లేదా ప్రైవేటు ప్రాక్టీసులకు వెళ్లిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నర్సులు, ఫార్మసిస్టులే ‘డాక్టర్ల’ అవతారం ఎత్తుతున్నారు. తమకున్న పరిమిత వైద్య పరిజ్ఞానంతో వారు మందులు రాసి ఇస్తున్నారు. ఇది ఒకరకంగా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే. అత్యవసర పరిస్థితుల్లో రోగులు చేసేదేమీ లేక, తమ జేబులు ఖాళీ అయినా సరే ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల బాట పడుతున్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంపై

వెల్లువెత్తుతున్న విమర్శలు

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ వైద్యం అటకెక్కిందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓపీ సేవల దగ్గర నుంచి మందుల పంపిణీ వరకు ప్రతిచోటా కొరత వేధిస్తోంది. ఆరోగ్య శాఖాధికారుల పర్యవేక్షణ నామమాత్రంగానే ఉండటంతో వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి పేదలకు వైద్య సేవలు సక్రమంగా అందించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement