క్రీడాకారులు ఫూల్‌ | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులు ఫూల్‌

May 11 2026 9:55 AM | Updated on May 11 2026 9:55 AM

● స్విమ్మింగ్‌పూల్‌లో సమ్మర్‌ దోపిడి ● ఔత్సాహికుల అవస్థలు ● పట్టించుకోని ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ యాజమాన్యం

స్విమ్మింగ్‌ పూల్‌..

విశాఖ అంటేనే క్రీడలకు, ముఖ్యంగా ఆక్వా స్పోర్ట్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌. ఎందరో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈతగాళ్లను అందించిన ఘన చరిత్ర సాగరతీరంలోని ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు ఉంది. ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నీలకు వేదికగా నిలిచి, రాష్ట్ర జట్టులో సింహభాగం స్విమ్మర్లను తయారుచేసిన ఈ ప్రతిష్టాత్మక కేంద్రం ప్రస్తుతం నిర్వహణా లోపాలతో కునారిల్లుతోంది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.2.41 కోట్ల భారీ వ్యయంతో ఈ కాంప్లెక్స్‌ను ఆధునీకరించారు. 1995 ఆగస్టు 22న అప్పటి మేయర్‌ సబ్బంహరి సారథ్యంలో విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌, జీవీఎంసీ సంయుక్త నిధులతో ఈ కేంద్రాన్ని నిర్మించారు. నాటి నుంచి క్రీడాకారుల పాలిట దేవాలయంగా విరాజిల్లిన ఈ కాంప్లెక్స్‌, నేడు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో తన ఉనికిని, నాణ్యతను కోల్పోతోంది.

– విశాఖ స్పోర్ట్స్‌

ప్రైవేట్‌ కాంట్రాక్టర్ల చేతుల్లోకి ఈ కాంప్లెక్స్‌ వెళ్లినప్పటి నుంచి క్రీడాకారుల శిక్షణ గాలికొదిలేసి, కేవలం లాభార్జనే ధ్యేయంగా కార్యకలాపాలు సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీ ఆస్తులపై పెత్తనం చెలాయిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో సుమారు 1500 నుంచి 1800 మంది వరకు, వింటర్‌ సీజన్‌లో కూడా రోజుకు 300 మందికి పైగా శిక్షణ కోసం ఇక్కడికి వస్తుంటారు. సమ్మర్‌ సీజన్‌లో ఒక్కొక్కరు నుంచి రూ.3000 వసూలు చేస్తున్నారు. ఇంతమంది వస్తున్నా అందుకు తగ్గట్టుగా కనీస సదుపాయాలు కల్పించడంలో ప్రైవేట్‌ నిర్వాహకులు ఘోరంగా విఫలమయ్యారు.

తీవ్ర ఇబ్బందులు

శిక్షణార్థుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. పూల్‌లో ఈత నేర్చుకోవడం కంటే, ఒడ్డున నిరీక్షించడానికే ఎక్కువ సమయం వృథా అవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మూడు గంటల పాటు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ టైమ్‌ స్లాట్లు కేటాయించి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, కనీస పర్యవేక్షణ కరువైంది. 16 అడుగుల లోతు గల ప్రధాన పూల్‌..పక్కనే ఉన్న 3 నుంచి 6 అడుగుల లెర్నింగ్‌ పూల్‌లో కలిపి నిత్యం వందలాది మంది కిక్కిరిసిపోతున్నారు. గంట స్లాట్‌లో ఒక చిన్నారికి కేవలం అరగంట పాటు మాత్రమే నీటిలో స్విమ్మింగ్‌ చేసే అవకాశం దక్కుతోందని, మిగిలిన 20 నిమిషాల నుంచి అరగంట సమయం కేవలం క్యూలో నిలబడటానికే సరిపోతోందని వాపోతున్నారు.

కోచ్‌ల కొరత

వందలాది మంది పిల్లలకు కేవలం ముగ్గురు కోచ్‌లు, నలుగురు లైఫ్‌ గార్డులు మాత్రమే అందుబాటులో ఉండటం నిర్వాహకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. శిక్షణ గురించి ప్రశ్నిస్తే ‘కోచ్‌లు దొరకడం లేదు’ అనే రొటీన్‌ సమాధానం వస్తోందని, అసలు బాధ్యతాయుతమైన కాంట్రాక్టర్‌ ఎక్కడ ఉంటాడో కూడా తెలియని పరిస్థితి నెలకొందని క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దలు స్వతంత్రంగా ప్రాక్టీస్‌ చేద్దామన్నా విపరీతమైన రద్దీ వల్ల నిరాశే ఎదురవుతోంది.

ఎంవీపీ కాలనీలోని ఎస్‌3

స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లోనే ఇదే పరిస్థితి

ఇదే తరహా పరిస్థితి ఎంవీపీ కాలనీలోని ఎస్‌3 స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లోనూ కనిపిస్తోంది. ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడం వల్ల క్రీడాకారుల భద్రత, రక్షణ, నాణ్యమైన శిక్షణ అనే అంశాలు మరుగున పడిపోయి, క్రీడా ప్రాంగణాలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయనేది నగ్న సత్యం. విశాఖ కీర్తి ప్రతిష్టలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇప్పటికై నా జీవీఎంసీ కమిషనర్‌ , కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించి, ఈ ప్రైవేట్‌ సంస్థల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలని, ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు న్యాయం చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement