విశాఖ స్పోర్ట్స్ : రైల్వే ఇండోర్ ఎన్‌క్లేవ్ వేదికగా రెండు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన డీఆర్‌ఎం కప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ముగిసింది. ఈ క్రీడా సంగ్రామంలో సెర్సా జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి విజేతగా అవతరించగా, ిస్పీనిక్స్ జట్టు రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో హోరాహోరీ పోరు సాగింది. సెమీఫైనల్ మ్యాచుల్లో పింపుల్ పాంథర్స్‌పై సెర్సా జట్టు, ముస్తాంగ్ జట్టుపై స్పినిక్స్ జట్టు గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నాయి. అత్యంత ఆసక్తికరంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో సెర్సా క్రీడాకారులు అంకిత్, బోలిక్, ప్రప్తి త్రయం తమ అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. స్పినిక్స్ జట్టు తరపున బరిలోకి దిగిన ప్రయాష్, కుందు, మహీధర్‌లు గట్టి పోటీని ఇచ్చినప్పటికీ, కీలక సమయాల్లో సెర్సా క్రీడాకారులు పైచేయి సాధించి టైటిల్‌ను కై వసం చేసుకున్నారు. ఇక సెమీస్‌లో ఓడిన జట్ల మధ్య మూడో స్థానం కోసం నిర్వహించిన పోటీలో అరుణ్, ప్రసన్న, జస్సికాతో కూడిన జట్టు విజయం సాధించి తర్వాతి స్థానంలో నిలిచింది. క్రీడాకారుల నైపుణ్యానికి, పట్టుదలకు ఈ టోర్నమెంట్ వేదికగా నిలిచింది. విజేత జట్లకు డీఆర్‌ఎం లిలిత్ బోహ్రా ట్రోఫీలు అందజేశారు.
విజేతలకు ట్రోఫీలు అందజేసిన డీఆర్‌ఎం


