డాబాగార్డెన్స్: రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2014లోనే రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటు చేయాల్సి ఉందని, అలాంటిది దాదాపు 13 ఏళ్ల తర్వాత జోన్ ప్రకటించినా.. టీడీపీ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని సిటు రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నరసింగరావు అన్నారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వామపక్షాలు, ప్రతిపక్షాల పోరాట ఫలితంగానే ఇప్పటికి రైల్వే జోన్ సాధించుకున్నామని పేర్కొన్నారు. నగరంలోని సిటు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సిటు రాష్ట్ర కార్యదర్శులు ఆర్‌కేఎస్‌వీ కుమార్, పి.మణి, పబ్లిక్ సెక్టార్ కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ జ్యోతీశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత రైల్వేజోన్ ప్రకటించడంపై టీడీపీ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. పేరుకే సౌత్‌కోస్ట్ జోన్ ప్రకటించినా, జోన్‌లోని గుండెకాయ వంటి కోరాపుట్‌ను తొలగించడంతో ఏపీపై కేంద్ర ప్రభుత్వ సవతి తల్లి ప్రేమ బహిర్గతమైందని ఎద్దేవా చేశారు. 2014 నుంచి మోదీ ప్రభుత్వం రైల్వే రిక్రూట్‌మెంట్ ఆపేసిందని, దీంతో సుమారు 5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సౌత్‌కోస్ట్‌లో కలపాలని సీఎం చంద్రబాబు ఇటీవల స్వయంగా కోరినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. జోన్ ఏర్పాటు వల్ల ఏం ప్రయోజనం ఒరుగుతుందో చెప్పాలని టీడీపీ నాయకులకు సవాల్ చేశారు. పేరుకు మాత్రమే సౌత్‌కోస్ట్ జోన్ ఆంధ్రప్రదేశ్‌కు వస్తుందని, కేకే లైన్ ఈస్ట్ కోస్ట్‌కు కేటాయించడంతో లాభాలన్నీ ఒడిశాకే వెళతాయన్నారు. భారతదేశంలో రైల్వే రవాణా అతి చౌకగా, సౌకర్యవంత ప్రయాణమని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైల్వే ప్రైవేటీకరణపై దూకుడుగా ఉందని ఆక్షేపించారు. రైల్వేను ముక్కలు చేసి అమ్మడానికి రంగం సిద్ధం చేసిందని ఆరోపించారు. రైల్వే ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని రైల్వే కార్మికులకు సిటు తరఫున విజ్ఞప్తి చేశారు.


