‘ముక్కల మామిడి’కి భలే గిరాకీ | - | Sakshi
Sakshi News home page

‘ముక్కల మామిడి’కి భలే గిరాకీ

May 11 2026 9:43 AM | Updated on May 11 2026 9:43 AM

● రైతు బజార్లలో జోరందుకున్న విక్రయాలు ● వినియోగదారులను ఊరిస్తున్న పచ్చడి మామిడి ● అందుబాటు ధరలో నాణ్యమైన కాయలు

ఎంవీపీకాలనీ: మామిడి సీజన్‌ రాగానే అందరికీ గుర్తొచ్చేది విభిన్న రుచుల సమ్మేళనం. తీపి, వగరు, కారం కలగలిసిన కమ్మదనాన్ని అందించడంలో మామిడికి సాటి లేదు. ప్రస్తుతం సీజన్‌లో రైతుబజార్లలో గ్రామీణ రైతులు నేరుగా విక్రయిస్తున్న మామిడికి ఆదరణ పెరిగింది. గత వారం రోజులుగా పండ్లను విక్రయిస్తున్న రైతులు, రెండు రోజులుగా పచ్చళ్లకు అనువైన కాయలను భారీగా అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఎంవీపీ కాలనీ రైతు బజార్‌తో పాటు నగరంలోని సీతమ్మధార, నరసింహనగర్‌, కంచరపాలెం, ఆరిలోవ సహా పలు ప్రాంతాల్లోని రైతుబజార్లు మామిడి కాయల కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. వినియోగదారులు పచ్చడి కాయలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపడమే కాకుండా, అక్కడే రైతులతో ముక్కలు కొట్టించుకుంటున్నారు. నగర ప్రజల అభిరుచికి అనుగుణంగా రైతులు సైతం విభిన్న రకాల మామిడి ఉత్పత్తులను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు.

మంచి నాణ్యత.. అందుబాటులో ధరలు

సీజన్‌ ప్రారంభం కావడంతో మామిడి కాయలు, పండ్లు సామాన్యులకు అందుబాటు ధరల్లోనే దొరుకుతున్నాయని రైతుబజార్‌ అధికారులు తెలిపారు. వివిధ రకాల రసాల కాయలు కేజీ రూ.40కే లభిస్తున్నాయి. పచ్చళ్ల కోసం ఎక్కువగా వాడే కలెక్టర్‌ కాయలు రూ.30, సువర్ణరేఖ రూ. 40కి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం రైతులు నేరుగా తోటల నుంచి తీసుకురావడం వల్ల నాణ్యత బాగుందని, అందుకే గిరాకీ ఎక్కువగా ఉందని వెల్లడించారు. రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున వినియోగదారులు ఇప్పుడే కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. తాము విక్రయించే ఉత్పత్తులు రుచికరంగా ఉండటంతో పాటు పచ్చళ్లు నిల్వకు అనువుగా ఉంటాయని రైతులు పేర్కొంటున్నారు.

ధరల వివరాలు..

మామిడి రకం ధర

(కేజీల్లో)

పర్యాలు రూ.30

కలెక్టర్‌ కాయలు రూ.30

వివిధ రసాలు రూ.40

కొలంగోవా రూ.35

సువర్ణరేఖ రూ.40

Advertisement
 
Advertisement
Advertisement