హెల్మెట్‌ భారం కాదు.. భరోసా | - | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ భారం కాదు.. భరోసా

May 11 2026 9:43 AM | Updated on May 11 2026 9:43 AM

ఏయూక్యాంపస్‌: అవగాహన, అప్రమత్తతతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి అన్నారు. ఆదివారం బీచ్‌రోడ్డులో ‘ఆప్‌ సబ్‌ కీ ఆవాజ్‌’సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో హోంగార్డులకు సీపీ చేతులమీదుగా హెల్మెట్లను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ నిబంధనలను పాటించడం వల్ల ప్రమాదాలను నివారించడమే కాకుండా విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రమాద సమయంలో ప్రాణనష్టాన్ని నివారించడానికి హెల్మెట్‌ ఎంతో దోహదపడుతుందని, వాహనం నడిపేవారితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. హెల్మెట్‌ భారం కాదు.. భరోసా అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా నగర పోలీసు శాఖలో పనిచేస్తున్న 400 మంది హోంగార్డులకు హెల్మెట్లు అందజేశారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు హోంగార్డులు, పోలీసు సిబ్బందితో కలిసి బైక్‌ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి సహకరించిన ఆప్‌ సబ్‌ కీ ఆవాజ్‌ సేవా సంస్థ ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు వడ్లమూడి శివకుమార్‌, కార్యదర్శి బవిశెట్టి కిరణ్‌ కుమార్‌, ఏడీసీపీ(ట్రాఫిక్‌) కె.ప్రవీణ్‌ కుమార్‌, ఏసీపీ (ట్రాఫిక్‌) ఎం.శ్రీనివాసరావు, పలువురు ట్రాఫిక్‌ సీఐలు, ఎస్‌ఐలు, పెద్ద సంఖ్యలో హోంగార్డులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement