బీచ్‌రోడ్డు: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని, తక్షణమే వీటిని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్.నరసింగరావు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద లేబర్ కోడ్స్ నిబంధనల కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కార్మికులను బానిసలుగా చేస్తూ, కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చేలా మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ రూల్స్‌ను విడుదల చేసిందని విమర్శించారు. దీనికి అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిబంధనలు రూపొందించుకోవాలని కేంద్రం కోరిందన్నారు. ఈ రూల్స్ గనుక అమలైతే కార్మికులు తీవ్రంగా నష్టపోతారని, ఇప్పటివరకు అనుభవిస్తున్న హక్కులన్నీ కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త నిబంధనల్లో పని గంటలు, జీతభత్యాలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై స్పష్టత లేదని.. యాజమాన్యాలకే సర్వహక్కులు కల్పించేలా ఇవి ఉన్నాయని మండిపడ్డారు. ఇది కార్మికులను బానిసలుగా మార్చడమేనని, లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, రాష్ట్ర కార్యదర్శి పి.మణి, విశాఖ జిల్లా పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్.జ్యోతీశ్వరరావు, ఎం.సుబ్బారావు, జి.టి.ప్రకాష్, చిన్నప్పుడు, వి.కృష్ణారావు, ఎం.సూరీడు, పోలేశ్వరరావు, చంద్రమౌళి, సత్యనారాయణ, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.


