విశాఖ సిటీ: శతాబ్ది వేడుకలు ఘనంగా జరుపుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. జ్ఞానాన్ని పంచే గురువుల చేతుల్లో జీతపు చీటీ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏయూ ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాలు వీధిన పడ్డాయి. ప్రతి నెలా ఒకటో తేదీకి ఖాతాల్లో జమయ్యే వేతనాలు ఇప్పుడు 10వ తేదీ దాటినా అందని ద్రాక్షగా మారాయి. పెరుగుతున్న జీవన వ్యయాలు, కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులతో సతమతమవుతున్న ఉద్యోగులు జీతాల కోసం యాజమాన్యం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెల కూడా ఇప్పటివరకు వేతనాలు జమ కాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి గ్రాంట్లు విడుదలయ్యే వరకు వేచి చూడాలని అధికారులు చెబుతున్నట్లు సమాచారం.
ఖాళీ అయిన ఖజానా.. జీతాలకే నిధుల కొరత
ఏయూలో సుమారు 300 మంది బోధన సిబ్బంది, 1,400 మంది బోధనేతర ఉద్యోగులు, 3,400 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ ప్రతి నెలా సుమారు రూ.34 కోట్ల మేర నిధులు అవసరం అవుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం ‘బ్లాక్ గ్రాంట్’ రూపంలో ఈ మొత్తాన్ని విడుదల చేయాలి. అయితే గత కొన్ని నెలలుగా ప్రభుత్వం నుంచి సరైన గ్రాంట్లు అందకపోవడంతో యూనివర్సిటీ అంతర్గత నిధుల నుంచే వేతనాలు చెల్లిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ నిధులూ పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఇప్పటికే రెండు దఫాల్లో సుమారు రూ.300 కోట్ల యూనివర్సిటీ నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న నిధులు కరిగిపోవడంతో, ప్రస్తుతం జీతాలు చెల్లించడమే యాజమాన్యానికి భారంగా మారింది.
శతాబ్ది ఉత్సవాల భారమూ ఏయూపైనే
ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏయూ శతాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఉత్సవాల నిర్వహణ కోసం ఏయూ తన సొంత నిధుల నుంచే సుమారు రూ.63.5 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒకవైపు ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి నిధులు లేక ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ప్రచార ఆర్భాటాల కోసం విశ్వవిద్యాలయ నిధులు ఖర్చు కావడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ గ్రాంట్లు విడుదల చేయకపోతే, రాబోయే నెలల్లో వేతనాల చెల్లింపే అసాధ్యమవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
విద్యార్థులపై ఫీజుల భారం
ప్రభుత్వ నిధులు అందకపోవడంతో వర్సిటీ అధికారులు ఇప్పుడు విద్యార్థులపై ఆర్థిక భారం మోపుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫీజులు బకాయి ఉన్నాయనే కారణంతో హాల్‌టికెట్లు నిలిపివేయడం, గతంలో హాస్టళ్లను మూసివేయడం వంటి చర్యలు విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. ఉన్నత విద్యా వ్యవస్థను రక్షించాల్సిన ప్రభుత్వమే విశ్వవిద్యాలయాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోందని విద్యావేత్తలు మండిపడుతున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఏయూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం రాష్ట్ర ఉన్నత విద్యా రంగానికే ప్రమాద సంకేతమని మేధావులు హెచ్చరిస్తున్నారు. వెంటనే పెండింగ్ గ్రాంట్లు విడుదల చేసి, ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.


