విశాఖలో సెమీ రింగురోడ్డు | - | Sakshi
Sakshi News home page

విశాఖలో సెమీ రింగురోడ్డు

May 10 2026 9:58 AM | Updated on May 10 2026 9:58 AM

● రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కి.మీ. నిర్మాణం ● మీడియాతో మంత్రి నారాయణ

విశాఖ సిటీ: నగరంలో రానున్న 50 ఏళ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్‌ రోడ్డు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శనివారం వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌పై ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక ఈ నెలాఖరుకల్లా సిద్ధమవుతుందని చెప్పారు. వీఎంఆర్‌డీఏ పరిధిలోని 6,836 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌పై సుమారు 3,720 అభ్యంతరాలు వచ్చాయని మంత్రి తెలిపారు. వీటిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించి, ఎమ్మెల్యేలు సూచించిన వినతుల్లో దాదాపు 90 శాతం సమస్యలను పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానిస్తూ నిర్మిస్తున్న ఏడు రహదారులలో మూడు పూర్తయ్యాయని వివరించారు. దీంతో పాటు భోగాపురం నుంచి విశాఖ నగరం వరకు ఒక ప్రత్యేకమైన బీచ్‌ కారిడార్‌ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ నగర ప్రజల భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం రూ.14 వేల కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలోని 95 శాతం ఇళ్లకు నేరుగా పైపులైన్ల ద్వారా తాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీలు ఎం.శ్రీభరత్‌, కలిశెట్టి అప్పలనాయుడు, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌, కమిషనర్‌ తేజ్‌ భరత్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement