ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణుల దత్తత కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ‘మంజునాథ్’ అనే రాయల్ బెంగాల్ టైగర్‌ను ఏడాది కాలానికి కమల్ ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ దత్తత తీసుకుంది. ఆ సంస్థ యజమాని దీపక్ కర్నాని బృందం శనివారం జూ క్యూరేటర్ జి.మంగమ్మను కలిసి, పులి వార్షిక నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.54,000ల చెక్కును అందజేశారు. అనంతరం పులి ఎన్‌క్లోజర్ వద్ద క్యూరేటర్ ఇతర అధికారులతో కలిసి దాతలకు దత్తత పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా క్యూరేటర్ మాట్లాడుతూ.. వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములు కావడానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. దత్తత తీసుకున్న సంస్థ ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బృందం సభ్యులు బి.భానువెంకట ప్రతాప్, ఉదయ కిరణ్, జూ అసిస్టెంట్ క్యూరేటర్ గోపి, జూ వైద్యుడు డాక్టర్ భాను తదితరులు పాల్గొన్నారు.


