మహారాణిపేట: కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కూడా వచ్చే రెండు నెలల్లో ప్రభుత్వ నర్సుల సంఘ కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.రాధమ్మ తెలిపారు. శనివారం కేజీహెచ్ క్లాక్‌రూమ్‌లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో 13 జిల్లాల్లో మాత్రమే ఎన్నికలు నిర్వహించామని, కొత్త జిల్లాల నుంచి కూడా సంఘాల ఏర్పాటుకు డిమాండ్ వస్తోందని చెప్పారు. అందువల్ల ఆయా జిల్లాల్లో సభ్యత్వ నమోదు చేపట్టి ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తామని వెల్లడించారు. అదే సందర్భంగా విశాఖ జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు ఉపాధ్యక్ష పదవులను ప్రభుత్వ (జీఏడీ) అనుమతితో కో–ఆప్షన్ ద్వారా భర్తీ చేసినట్లు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులుగా ఎ.జయలక్ష్మి, ఎస్.జి.గౌరి, జి.హేమలత, పి.కల్పనలను నియమించగా, కార్యవర్గ సభ్యురాలిగా డి.విజయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఇన్–సర్వీస్ నర్సులు ఎమ్మెస్సీ చదివేందుకు ప్రభుత్వం త్వరలో జీవో విడుదల చేయనుందని, విశాఖ నర్సింగ్ కళాశాలకు 10 సీట్లు కేటాయించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నర్సులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వా టి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నా మని చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట మ్మ, జిల్లా అధ్యక్షురాలు గంగాభవాని, జిల్లా కార్యదర్శి జీవీ ఎస్ వరలక్ష్మి, కోశాధికారి వంశీ, వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వరి, ఈసీ సభ్యులు పద్మజ, వినీల, మెహర్ శాంతి, లిల్లి పాల్గొన్నారు.
ప్రభుత్వ నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రాధమ్మ


