పవర్‌ గర్జన | - | Sakshi
Sakshi News home page

పవర్‌ గర్జన

May 9 2026 8:14 AM | Updated on May 9 2026 8:14 AM

● సీమెన్స్‌ 9000 హెచ్‌పీ ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ల అరంగేట్రం ● 120 కి.మీ వేగంతో దూసుకెళ్లే శక్తివంతమైన ఫ్రైట్‌ ఇంజిన్లు ● విశాఖలో తొలి మెయింటెనెన్స్‌ డిపో ప్రారంభం ● రూ.27,000 కోట్ల ఒప్పందంలో భాగంగా 1,200 ఇంజిన్ల సరఫరా

పట్టాలపై

హెచ్‌పీ విద్యుత్‌ ఫ్రైట్‌ లోకోమోటివ్స్‌

సాక్షి, విశాఖపట్నం : భారతీయ రైల్వే సరుకు రవాణా ముఖచిత్రాన్ని మార్చే దిశగా ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. అంతర్జాతీయ ఇంజనీరింగ్‌ దిగ్గజం సీమెన్స్‌ రూపొందించిన అత్యంత శక్తివంతమైన 9000 హార్స్‌పవర్‌ ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌లు భారతీయ పట్టాలపై అరంగేట్రం చేశాయి. ఈ అత్యాధునిక ఇంజిన్ల మొదటి సెట్‌ను వాణిజ్య కార్యకలాపాల కోసం రైల్వే శాఖకు అప్పగించారు. ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా లోకోమోటివ్‌ల నిర్వహణ కోసం దేశంలోనే మొదటి డిపోను విశాఖపట్నంలో ప్రారంభించడం గమనార్హం. ఒప్పందం కుదిరిన 36 నెలల్లోనే 90 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో మొదటి సెట్‌ని సిద్ధం చేయడం విశేషం.

90 శాతం

స్వదేశీ పరిజ్ఞానంతో..

ఈ ‘డీ9’ మోడల్‌ 9000 హెచ్‌పీ లోకోమోటివ్‌లు యూరోపియన్‌ ప్రమాణాలతో, 90 శాతం స్వదేశీ సాంకేతికతతో తయారయ్యాయి. గుజరాత్‌లోని దాహోద్‌ ఫ్యాక్టరీలో వీటిని నిర్మిస్తున్నారు. ఇందులో వాడిన ‘రైలిజెంట్‌ ఎక్స్‌’ అనే ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఇంజిన్‌లో ఏదైనా లోపం తలెత్తే అవకాశం ఉంటే ముందే గుర్తించవచ్చు. అధిక సామర్థ్యం వల్ల విద్యుత్‌ వినియోగం తగ్గడమే కాకుండా, కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది.

విశాఖ సహా 4 నిర్వహణ కేంద్రాలు

ఈ లోకోమోటివ్‌ల జీవితకాల నిర్వహణ కోసం ‘లైఫ్‌సైకిల్‌ పార్ట్‌నర్‌షిప్‌ మోడల్‌’లో దేశవ్యాప్తంగా నాలుగు డిపోలను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నంలో తొలి డిపో కార్యకలాపాలు ప్రారంభం కాగా, త్వరలోనే రాయ్‌పూర్‌, ఖరగ్‌పూర్‌, పూణేలలో కూడా డిపోలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement