పైరవీల ‘వల’లో పేదల ‘ఆశ’ | - | Sakshi
Sakshi News home page

పైరవీల ‘వల’లో పేదల ‘ఆశ’

May 9 2026 8:14 AM | Updated on May 9 2026 8:14 AM

ఆశ పోస్టులకు భారీ పోటీ రంగంలోకి రాజకీయ పైరవీలు ఆశ ఉద్యోగాలపై ఎమ్మెల్యేల కన్ను బ్రోకర్ల బేరసారాలు 68 పోస్టులకు 6 వేల దరఖాస్తులు ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ.4లక్షల వరకు వసూలు

మహారాణిపేట: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించే ‘ఆశ’ వర్కర్ల పోస్టులకు గతంలో లేని విధంగా విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. గతంలో ఆరోగ్య రంగంపై కనీస అవగాహన ఉన్న వారితో ఈ పోస్టులను భర్తీ చేసేవారు, కానీ ప్రస్తుతం ఈ ఉద్యోగాలను చేజిక్కించుకోవడానికి పైరవీలు, రాజకీయ సిఫార్సులు ఊహించని స్థాయిలో సాగుతున్నాయి. జిల్లాలో ఖాళీగా ఉన్న కేవలం 68 ఆశ వర్కర్ల పోస్టుల కోసం సుమారు 6 వేల మంది నిరుద్యోగ మహిళలు దరఖాస్తు చేసుకోవడం చూస్తుంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి పోస్టుకు సగటున వంద మందికి పైగా పోటీ పడుతుండటంతో, ఎంపిక ప్రక్రియ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి పెద్ద సవాలుగా మారింది.

బ్రోకర్ల దందా

మరోవైపు ఈ నియామకాల్లో రాజకీయ జోక్యం పరాకాష్టకు చేరుకుంది. వార్డు, మండల స్థాయి పోస్టుల కోసం సాక్షాత్తూ ఎమ్మెల్యేలే నేరుగా రంగంలోకి దిగడంతో, స్థానిక మాజీ కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేలకు మధ్య తీవ్రస్థాయిలో ‘కోల్డ్‌ వార్‌’ నడుస్తోంది. అటు కూటమి నాయకులు, ఇటు మాజీ ప్రజాప్రతినిధులు తమ అనుచరులకు పోస్టులు ఇప్పించుకోవడానికి జిల్లా అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయం ఇప్పుడు సిఫార్సు లేఖలతో నిండిపోయింది. ఎమ్మెల్యేలు, వారి వ్యక్తిగత సహాయకులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ రాజకీయ ఒత్తిడిని ఆసరాగా చేసుకున్న కొంతమంది మధ్యవర్తులు, శాఖలోని కొందరు ఉద్యోగులు బేరసారాలకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు రేటు నిర్ణయించి, నిరుద్యోగ మహిళలను మాయమాటలతో నమ్మిస్తూ బ్రోకర్లు దందా సాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎమ్మెల్యేల కనుసన్నల్లో..

ప్రస్తుతం పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల పరిధిలో దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. నిబంధనల ప్రకారం 25 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉండి, స్థానిక సచివాలయం పరిధిలో నివసించే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మెరిట్‌, రోస్టర్‌ విధానాన్ని అనుసరించి ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే భర్తీ ప్రక్రియ సాగుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. కార్పొరేటర్ల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం అంతా ఎమ్మెల్యేల హవానే నడుస్తోంది. స్థానికంగా ఉండే మాజీ కార్పొరేటర్ల సిఫార్సులను పక్కన పెట్టి, ఎమ్మెల్యేలు నేరుగా వార్డు స్థాయి పోస్టుల్లో జోక్యం చేసుకోవడం స్థానిక నేతల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. పారదర్శకతతో భర్తీ చేయాల్సిన సేవా పోస్టులు కాస్తా, రాజకీయ పైరవీలకు, భారీ బేరసారాలకు వేదికగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంపిక చేసిన జాబితాను జిల్లా అధికారులు ఆమోదించాల్సి ఉన్న నేపథ్యంలో, చివరికి ఎవరికి ఈ పోస్టులు దక్కుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement