మెట్రో సీసీకి భారీ విజయం | - | Sakshi
Sakshi News home page

మెట్రో సీసీకి భారీ విజయం

May 9 2026 8:08 AM | Updated on May 9 2026 8:08 AM

విశాఖ స్పోర్ట్స్‌ : సూపర్‌ నాకవుట్‌ వన్డే మ్యాచ్‌ల్లో మెట్రో సీసీ, గెలాక్సీ సీసీ జట్లు పరుగుల వరద పారించి భారీ విజయాలను అందుకున్నాయి. రైల్వే స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న మెట్రో సీసీ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 526 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ హ్రితిక్‌ కేవలం 45 బంతుల్లోనే 13 సిక్సర్లు, 8 ఫోర్లతో 119 పరుగులు చేయగా, మిడిలార్డర్‌లో పరమ్‌వీర్‌ 147 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరికి తోడుగా కెప్టెన్‌ యువన్‌ (85), వినోద్‌ (87), శ్రావణ్‌ (52) అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం ఛేదనకు దిగిన వైజాగ్‌ బ్లూస్‌ జట్టు 18.1 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. మెట్రో బౌలర్‌ అచ్యుత్‌ 5 వికెట్లతో ప్రత్యర్థి నడ్డి విరవడంతో మెట్రో సీసీ 435 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.

మరోవైపు వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన హిందూ ట్రోఫీ మ్యాచ్‌లో గెలాక్సీ సీసీ జట్టు సిటీ పోలీస్‌పై 360 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గెలాక్సీ సీసీ 478 పరుగులకు ఆలౌటైంది. హిమకర్‌ (61), భస్వంత్‌ (76), ధీరజ్‌ (59) రాణించడంతో జట్టు భారీ స్కోరును అందుకోగలిగింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సిటీ పోలీస్‌ జట్టు గెలాక్సీ బౌలర్ల ధాటికి తట్టుకోలేక 25.5 ఓవర్లలో 118 పరుగులకే చాపచుట్టేసింది. యశ్వంత్‌, వాసు, ధీరజ్‌లు తలో రెండు వికెట్లు తీసి పోలీస్‌ జట్టును కోలుకోలేని దెబ్బతీశారు. జగదీష్‌ (21) మినహా మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేకపోవడంతో పోలీస్‌ జట్టుకు భారీ పరాజయం తప్పలేదు.

ఘోరంగా ఓడిన సిటీ పోలీస్‌ జట్టు

Advertisement
 
Advertisement
Advertisement