ఆరిలోవ: జీవీఎంసీ 9వ వార్డు పరిధిలోని ప్రశాంతినగర్ కొండవాలు ప్రాంతంలో నెలకొన్న దారి వివాదంపై సింహాచలం దేవస్థానం అధికారులు స్పందించారు. ఓ వ్యక్తి అక్రమంగా నిర్మించిన ఇంటి గోడను శుక్రవారం దేవస్థానం సిబ్బంది సమక్షంలో తొలగించారు. స్థానిక మెట్ల మార్గానికి అడ్డంగా గోడ నిర్మించడంతో పాటు దారిని మూసివేయడంపై ఇద్దరు వ్యక్తుల మధ్య గత కొంతకాలంగా గొడవ జరుగుతోంది. ఈ వివాదంలో మనస్తాపం చెందిన రాజేశ్వరరావు అనే వ్యక్తి ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఈనెల 2న ‘సాక్షి’ దినపత్రికలో ‘దారి వివాదం.. ఆత్మహత్యాయత్నం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. మెట్ల మార్గానికి అడ్డంగా ఉన్న గేటును సిబ్బంది సమక్షంలో స్థానికులే తొలగించగా, అక్రమంగా నిర్మించిన గోడను అధికారులు కూల్చివేశారు. దేవస్థానం స్థలంలో నిర్మించిన గోడను తొలగించిన అధికారులు.. మరుగుదొడ్డి కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్‌ను మాత్రం అలాగే వదిలేయడంపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాల తొలగింపులో అధికారులు పక్షపాతం చూపడం సరికాదని కాలనీవాసులు పేర్కొంటున్నారు.


