నష్టాల నుంచి
సహజంగా
ఎల్పీజీ భారం నుంచి పీఎన్‌జీ వైపు..
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కీలక నిర్ణయం పశ్చిమాసియా యుద్ధంతో ఆకాశాన్నంటిన ఎల్పీజీ ధరలు గతంలో టన్ను ఎల్పీజీ రూ.70 వేలు.. ప్రస్తుతం రూ. 1.15 లక్షలు ఉత్పత్తి వ్యయం తగ్గించేందుకు యాజమాన్యం చర్యలు రోజుకు 62 వేల క్యూబిక్ మీటర్ల లక్ష్యంతో కొత్త పైప్‌లైన్ ఇంధన ఆదాతో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నం
విశాఖ సిటీ: విశాఖ ఉక్కు కర్మాగారం ఒక కీలకమైన ఇంధన మార్పునకు శ్రీకారం చుట్టింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల కారణంగా ఎల్పీజీ ధరలు ఆకాశాన్నంటడంతో, స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, కర్మాగారాన్ని నష్టాల నుంచి గట్టెక్కించే లక్ష్యంతో పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్‌జీ) వాడకాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ నూతన ఇంధన సరఫరా వ్యవస్థను ప్లాంట్‌లోని గ్యాస్ మిక్సింగ్ స్టేషన్ వద్ద ప్రారంభించడం ఒక చారిత్రాత్మక మలుపుగా నిలిచింది.
ఎల్పీజీ ధరల సెగ : ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి విశాఖ ఉక్కు బడ్జెట్ తలకిందులైంది. అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినడంతో ఎల్పీజీ ధరలు అసాధారణంగా పెరిగాయి. యుద్ధానికి ముందు టన్ను ఎల్పీజీ ధర సుమారు రూ. 70 వేలు ఉండగా, అది ప్రస్తుతం రూ.1.15 లక్షలకు చేరుకుంది. దీంతో దాదాపు 65 శాతం అదనపు భారం ప్లాంట్‌పై పడింది. ప్లాంట్‌లోని స్టీల్ బ్లూమ్స్ కటింగ్, రోలింగ్ మిల్లుల వంటి విభాగాల్లో గ్యాస్ వినియోగం అత్యంత కీలకం. పెరిగిన ధరల వల్ల ప్రతి టన్ను ఉక్కు ఉత్పత్తిపై వ్యయం గణనీయంగా పెరిగి, సంస్థను మరింత నష్టాల్లోకి నెట్టింది.
పీఎన్‌జీతో భారీ పొదుపు
ఎల్పీజీ భారంగా మారడంతో స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం పీఎన్‌జీ వైపు మళ్లింది. ఇంధన సామర్థ్యాన్ని శాసీ్త్రయంగా గిగా క్యాలరీలలో కొలిచినప్పుడు ఎల్పీజీ, పీఎన్‌జీ మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఒక గిగా క్యాలరీ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఎల్పీజీ ద్వారా సుమారు రూ. 9,000 ఖర్చయ్యేది.
ఇప్పుడు పీఎన్‌జీ ద్వారా అదే స్థాయి శక్తిని కేవలం రూ. 6,500కే పొందడం సాధ్యమవుతోంది. అంటే ప్రతి గిగా క్యాలరీ ఇంధనంపై ప్లాంట్‌కు దాదాపు రూ.2,500 మేర ఆదా అవుతోంది. తద్వారా సుమారు 28 శాతం మేర ఇంధన ఖర్చు తగ్గుతోంది. ప్లాంట్ పూర్తి స్థాయిలో నడవాలంటే గంటకు సుమారు 45 వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ అవసరం ఉంటుంది. ఇందులో ప్రధానంగా కోక్ ఓవెన్ గ్యాస్(సీవోజీ) వాడతారు. అయితే ప్లాంట్‌లోని ఐదు కోక్ ఓవెన్ బ్యాటరీల పని తీరు మందగించడం వల్ల గంటకు 15 వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ లోటును పూడ్చడానికి గతంలో వాడిన ఎల్పీజీ స్థానాన్ని ఇప్పుడు పీఎన్‌జీ భర్తీ చేయనుంది.
4.5 కిలోమీటర్ల పైప్‌లైన్
ఈ ఇంధన మార్పిడి ప్రాజెక్టును ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) సమన్వయంతో చేపట్టారు. విశాఖలోని ఏపీ మెడ్‌టెక్ జోన్ సమీపంలో ఉన్న ఐవోసీఎల్ ఎల్‌ఎన్‌జీ హబ్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు ప్రత్యేకంగా 4.5 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్‌ను నిర్మించారు. ఈ పనులు ఏప్రిల్ 2వ తేదీన ప్రారంభం కాగా, కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేసి గ్యాస్ సరఫరాను ప్రారంభించారు. పైప్‌లైన్ ద్వారా గ్యాస్ నేరుగా ప్లాంట్‌కు చేరడం వల్ల రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా, సిలిండర్ల నిల్వ, భద్రతా పరమైన ఇబ్బందులు కూడా తొలగిపోయాయి.
సరఫరా లక్ష్యాలు..
భవిష్యత్తు ప్రణాళిక
మొదటి దశలో భాగంగా ప్రస్తుతం రోజుకు 18 వేల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల పీఎన్‌జీని ప్లాంట్ అవసరాలకు వినియోగిస్తున్నారు. దీనివల్ల తక్షణమే రోజువారీ ఖర్చుల్లో కొంత ఉపశమనం లభించింది. అయితే ప్లాంట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండో దశ పనులను కూడా వేగవంతం చేశారు. 2027 మే నాటికి పీఎన్‌జీ సరఫరాను రోజుకు 62 వేల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకుంటే, ప్లాంట్ తన ఇంధన అవసరాల కోసం ఎల్పీజీపై ఆధారపడటాన్ని పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది.


