ఏయూలో నిలిచిన కొలువుల భర్తీ | - | Sakshi
Sakshi News home page

ఏయూలో నిలిచిన కొలువుల భర్తీ

May 8 2026 9:38 AM | Updated on May 8 2026 9:38 AM

● రాజకీయ దుర్బుద్ధితో నోటిఫికేషన్‌ రద్దు ● 523 అధ్యాపక పోస్టులకు మంగళం ● వేలాది మంది దరఖాస్తుదారుల పరిస్థితి అయోమయం

విశాఖ సిటీ: చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. రాజకీయ కుతంత్రంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని అధ్యాపకుల పోస్టుల భర్తీ ప్రక్రియను రద్దు చేసింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందన్న దుర్బుద్ధితో గత నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. దీంతో ఏయూలో ఖాళీగా ఉన్న 523 అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న వేలాది మంది ఆశలు ఆవిరైపోయాయి. ఏయూలో దీర్ఘకాలంగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2014–2019 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం కనీసం ఆ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టలేదు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయూలో 523 అధ్యాపక పోస్టుల భర్తీ కోసం 2023లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనికి వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికలకు సమయం ఆసన్నమవడంతో భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు.

సుదీర్ఘ నిరీక్షణ వృథానేనా?

ఎన్నికలకు ముందు భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. కొత్త ప్రభుత్వంలో రిక్రూట్‌మెంట్‌ పూర్తవుతుందని దరఖాస్తుదారులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఆ నోటిఫికేషన్‌ను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అభ్యర్థులు ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయింది. తాజాగా తీసుకున్న నిర్ణయం అభ్యర్థులకు శరాఘాతంగా మారింది. నోటిఫికేషన్‌ ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు పరీక్షలు నిర్వహించకపోగా, ఇప్పుడు ఏకంగా రద్దు చేయడంపై దరఖాస్తుదారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికి

క్రెడిట్‌ దక్కకూడదనే..!

గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం నియామకాలు చేపడితే, ఆ ఘనత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్న భయంతోనే ప్రస్తుత ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్సిటీల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేసింది. ఏయూలో నాక్‌ ‘ఏ+’గ్రేడ్‌ 3.74 స్కోరుతో దూసుకుపోతున్న తరుణంలో, అధ్యాపక కొరతను తీర్చడం వర్సిటీ అభివృద్ధికి ఎంతో కీలకం. కానీ, రాజకీయ స్వార్థం ముందు నిరుద్యోగుల భవిష్యత్తు తృణప్రాయంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నోటిఫికేషన్‌ రద్దు

ఏయూలో ఖాళీగా ఉన్న 523 అధ్యాపక పోస్టుల భర్తీకి గతంలో ఇచ్చిన అనుమతిని ఉపసంహరించినట్లు ఏయూ రిజిస్ట్రార్‌ రాంబాబు ప్రకటించారు. 2023, నవంబర్‌ 1న ప్రచురించిన నోటిఫికేషన్‌ ఉనికిలో లేదని స్పష్టం చేశారు. అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారు దరఖాస్తు రుసుం తిరిగి పొందేందుకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ www. andhrauniversity.edu.inని సందర్శించాలని సూచించారు. పాత నోటిఫికేషన్‌ రద్దు చేసిన అధికారులు కొత్త నోటిఫికేషన్‌ ఎప్పుడు వస్తుందో మాత్రం చెప్పకపోవడం గమనార్హం. సుదీర్ఘ కాలం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ రద్దు నిర్ణయంపై తీవ్రంగా మండిపడుతున్నారు.

నిరుద్యోగుల ఆశలపై నీళ్లు

Advertisement
 
Advertisement
Advertisement