40 ఏళ్లు దాటిన వారికి ఈఎస్‌ఐసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
సీతంపేట: కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ), కొత్త కార్మిక కోడ్ నిబంధనల ప్రకారం 40 ఏళ్లు పైబడిన బీమాదారుల కోసం ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. కార్మికుల్లో ఆరోగ్య స్పృహను పెంపొందించడం,అసంక్రమిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఈఎస్‌ఐసీ అసిస్టెంట్ డైరెక్టర్ వి.శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. విశాఖపట్నం సబ్ రీజినల్ ఆఫీస్ ఆధ్వర్యంలో మల్కాపురం ఈఎస్‌ఐఎస్ ఆసుపత్రిలో జాయింట్ డైరెక్టర్(ఇన్‌చార్జి) కె.ఆర్.రవికుమార్, డాక్టర్ సి.సునీత, ఇతర వైద్యుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫణేందర్ కేతా మాట్లాడుతూ.. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆరోగ్య పరీక్ష నిర్వహిస్తామన్నారు. అర్హులైన కార్మికులు ఉదయం 8 గంటలకు మల్కాపురం ఈఎస్‌ఐసీ ఆసుపత్రికి చేరుకోవాలని సూచించారు. సీబీసీ, ఆర్‌ఎఫ్‌టీ, ఎల్‌ఎఫ్‌టీ, ఎఫ్‌బీఎస్, పీపీబీఎస్, హెచ్‌బీఏ1సీ, టీఎఫ్‌టీ, లిపిడ్ ప్రొఫైల్, యూరిన్ రూటీన్, సీరమ్ యూరిక్ యాసిడ్, హెచ్‌ఐవీ 1–2, హెచ్‌బీఎస్‌ఏజీ, యాంటీ హెచ్‌సీవీ, ఈసీజీ, ఛాతీ ఎక్స్‌రే తదితర పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షల్లో ఏవైనా అనారోగ్య సమస్యలు గుర్తిస్తే, బాధితులకు అవసరమైన తదుపరి చికిత్స, మందులను ఉచితంగా అందజేస్తామన్నారు. విశాఖ పరిధిలోని అన్ని సంస్థల యజమానులు, యాజమాన్యాలు తమ వద్ద పనిచేస్తున్న అర్హులైన కార్మికులను ఆరోగ్య పరీక్షల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని జాయింట్ డైరెక్టర్ కె.ఆర్.రవికుమార్ కోరారు. మరిన్ని వివరాల కోసం అక్కయ్యపాలెంలోని ఈఎస్‌ఐసీ సబ్ రీజినల్ ఆఫీస్‌ను నేరుగా గానీ, లేదా 0891–2733126 నంబర్‌కు ఫోన్ చేసి గానీ సంప్రదించవచ్చు. అలాగే bfts-vizag@esic.gov.inకు ఈమెయిల్ చేయవచ్చు లేదా సమీపంలోని ఈఎస్‌ఐసీ బ్రాంచ్ ఆఫీస్/డిస్పెన్సరీని సంప్రదించవచ్చు.


