‘లక్షింపేట మారణకాండ బాధితులకు న్యాయం చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘లక్షింపేట మారణకాండ బాధితులకు న్యాయం చేయాలి’

May 8 2026 9:38 AM | Updated on May 8 2026 9:38 AM

డాబాగార్డెన్స్‌: లక్షింపేట మారణకాండ బాధితులకు న్యాయం చేయాలని విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక(విదసం) రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ బూసి వెంకట్రావు డిమాండ్‌ చేశారు. లక్షింపేట మృతుల కుటుంబాలకు న్యాయం కోసం ప్రభుత్వం నియమించిన ఓపెన్‌ కోర్టు వల్ల బాధితులకు న్యాయం జరిగేలా లేదని ఆరోపిస్తూ.. విదసం ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వెంకట్రావు మాట్లాడుతూ 2012 జూన్‌ 12న మాలపల్లిపై తూర్పు కాపులు బాంబులు, బరిశెలు, కత్తులు, గొడ్డలతో వచ్చి కళ్లల్లో కారం చల్లి కిరాతకంగా చేసిన హత్యాకాండలో ఐదుగురు దళితులు చనిపోయారని గుర్తు చేశారు. నాడు దళిత సంఘాల పోరాటం ఫలితంగా ప్రభుత్వం లక్షింపేటలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిందని, 14 ఏళ్లుగా జరుగుతున్న న్యాయ ప్రక్రియ నేడు కీలక దశకు చేరిందన్నారు. రెండేళ్లుగా ఈ కేసు వాదనకు ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ లేరని, బాధితులు కోరినా ప్రభుత్వం నియమించలేదని ఆక్షేపించారు. ప్రస్తుతం జరుగుతున్న న్యాయ విచారణపై తమకు సందేహాలున్నాయని, ప్రస్తుత విచారణ తీరు చూస్తే.. తీర్పుపై బాధితులకు నమ్మకం లేదన్నారు. దీనిపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. నిరసనలో గుడివాడ ప్రసాద్‌, యడ్ల గోపి, గోడి వెంకటేశ్వరరావు, గుడాల ఈశ్వరరావు, పి.భాస్కరరావు, ఉమా మహేశ్వరి, గుడివాడ భాస్కరరావు, సీహెచ్‌ రాంబాబు, నావేటి గురుదేవి, ఉదయ్‌, కై లాస్‌ నాయక్‌, చాపల దాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement