ఆరిలోవ: జాతీయ రహదారిపై బస్ ఢీకొన్న ఘటనలో ఓ నర్స్ మృతి చెందింది. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాలు.. ఆరిలోవ ప్రాంతం గాంధీనగర్‌కు చెందిన నీలపు ప్రవళిక(22) గీతం ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది. గురువారం సాయంత్రం ఆమె ఆస్పత్రి విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఎండాడ మీదుగా ఇంటికి బయలుదేరింది. హైవేపై విశాఖ వ్యాలీ స్కూల్ కూడలి వద్ద సిగ్నల్ పడటంతో వాహనం నిలిపింది. అదే సమయంలో మధురవాడ నుంచి నగరానికి వస్తున్న ఆర్టీసీ బస్ ఆగివున్న ప్రవళిక స్కూటీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో స్కూటీ పైనుంచి ప్రవళిక కింద పడి తలకు తీవ్రగాయం కావడంతో అధిక రక్త స్రావమైంది. తోటి ఉద్యోగులు, ప్రయాణికులు కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆటోలో సమీపంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు.


