మద్దిలపాలెం: త్యాగరాజ స్వామి 259వ జయంతి ఉత్సవాన్ని కళాభారతి ఆడిటోరియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ అధ్యక్షుడు మంతెన సత్యనారాయణరాజు, కార్యదర్శి డాక్టర్ రాంబాబు నాదస్వర విద్వాంసులు అప్పన్న, వీణా విద్వాంసులు పద్మ రవిశంకర్, డాక్టర్ బీకేడీ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఏడు నాదస్వరాలు, నాలుగు డోళ్లు కలిపి బృందంగా మంగళకరంగా త్యాగరాజ స్వామి జయంత్యుత్సం ప్రారంభమైంది.
త్యాగరాజ ఆరాధనలో భాగంగా 29 వీణలతో గంటసేపు వీణా కచేరీ వీనుల విందుగా సాగింది. ఆహూతులను సంగీత సాగరంలో ఓలలాడించింది. అనంతరం 21 మంది వేణుగానామృతాన్ని అద్భుతంగా ఆలాపించారు. వీరితోపాటు 30 మంది వయోలిన్‌పై చేసిన కచేరీ మంత్రముగ్ధులను చేసింది. వేదికపై 125 మంది కళాకారులతో జరిగిన బృందగాన కచేరీ ఈ ఉత్సమానికే వన్నె తెచ్చింది.


