డీఈవో ప్రేమ కుమార్
సీతంపేట: సైన్స్ ఉపాధ్యాయులు హాండ్స్ ఆన్(ప్రయోగ పూర్వక) పద్ధతుల ద్వారా బోధనా సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ కుమార్ సూచించారు. అక్కయ్యపాలెంలోని ఒక హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ బయలాజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు అనుభవాత్మక బోధనా పద్ధతులను అవలంబించాలని, బోధనా సామగ్రిని సొంతంగా తయారు చేసుకోవడం ద్వారా విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమవుతాయని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ సాంకేతికతను కూడా బోధనలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జోగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 6, 7 తరగతుల నూతన పాఠ్యపుస్తకాల బోధనలో ఉపాధ్యాయులు తమ అనుభవాలను రంగరించి మెరుగైన వ్యూహాలను రూపొందించుకోవాలన్నారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు నీలకంఠ మాట్లాడుతూ.. 6, 7, 8 తరగతుల్లోని సైన్స్ భావనలను ప్రయోగపూర్వకంగా ఎలా వివరించాలో ఈ శిక్షణలో ప్రాక్టికల్‌గా నేర్పించినట్లు తెలిపారు. ప్రధాన కార్యదర్శి మహ్మద్ గౌస్ మాట్లాడుతూ.. సాంకేతికత, ప్రాక్టికల్స్ కలయికతో బోధన మరింత ప్రభావవంతంగా మారుతుందన్నారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో బోధనా సామగ్రి తయారీ, పాఠ్య ప్రణాళికలు, ప్రజెంటేషన్లు, పోస్టర్లు, విద్యా సంబంధిత వీడియోల తయారీపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే బోధనా పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులందరూ పెదవాల్తేరులోని బయలాజికల్ పార్క్‌ను సందర్శించారు. అక్కడ ఉన్న ఔషధ మొక్కల గురించి డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ వ్యవస్థాపకుడు రామమూర్తి, విశ్రాంత ఉపాధ్యాయురాలు మంగతాయారు వివరించారు. పర్యావరణ దినోత్సవాలను అర్థవంతంగా నిర్వహించాలని గ్రీన్ కై ్లమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జె.వి.రత్నం కోరారు. కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 50 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


