విశాఖ సిటీ: గ్రామీణ ప్రాంతాల పట్టణీకరణ దిశగా పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వీఎంఆర్డీఏ చైర్మన్ ఎం.వి.ప్రణవ్‌గోపాల్ తెలిపారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో చైర్మన్ అధ్యక్షతన బుధవారం జరిగిన అథారిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం, విజయనగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, పాయకరావుపేట తదితర మున్సిపాలిటీల్లో కాలువలు, రహదారులు, పార్క్‌ల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. గాజువాకలో స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణానికి సుమారు రూ.9 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కై లాసగిరిపై త్రిశూల్‌ను ఈ నెల 9న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ రహదారుల నిర్మా ణం అనుకున్న సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. సెంట్రల్ పార్క్ ఆవరణలో యువగళం యాంటీ డ్రగ్ పార్క్ నిర్మాణం 3 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ మాట్లాడుతూ వీఎంఆర్డీఏ ఇటీవల కొత్తగా రూపొందించిన విస్టా యాప్ వినియోగంతో ఆదా యం గణనీయంగా వృద్ధి చెందిందన్నారు. అనకాపల్లి, విజయనగరంలలో ఉన్న జోనల్ ఆఫీసుల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యకలాపాలను పూర్తి స్థాయిలో చేపడతామన్నారు. సమావేశంలో వర్చువల్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్, అనకాపల్లి జేసీ శౌర్యమన్ పటేల్ పాల్గొనగా వీఎంఆర్డీఏ ఎస్‌ఈ వినయ్ కుమార్, ఎస్‌ఈ మధుసూదనరావు తదితరులు హాజరయ్యారు.


