అల్లిపురం: జీవీఎంసీ ‘బాల్యం’ విద్యా కేంద్రాల్లో చిన్నారుల ఉచిత ప్రవేశానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. 3 నుంచి 5 ఏళ్ల వయసు గల చిన్నారులను ఈ కేంద్రాల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 2026–27 విద్యా సంవత్సరానికి గాను బాల్యం కేంద్రాల్లో ప్రవేశాలు, సర్వే నిర్వహణకు సంబంధించిన సమాచార, సోషల్ మీడియా పోస్టర్లను బుధవారం ఆయన తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లి బాల్యం కేంద్రాలతో పాటు ఒకటో తరగతిలో విద్యార్థుల నమోదు శాతం పెరిగేలా చూడాలని బాల్యం పీడీ హెచ్.శంకరరావును ఆదేశించారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ ఆవుపాటి మోహన్ కుమార్, బాల్యం అధ్యాపకులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.


