● అల్లూరి స్మారకం..అభివృద్ధికి దూరం!
● చెదురుతున్న విప్లవ వీరుడి జ్ఞాపకాలు
● నేడు అల్లూరి వర్ధంతి
తెలుగుజాతి రోషం.. మన్యం పౌరుషం.. అల్లూరి సీతారామరాజు అడుగుజాడలు నేడు పాలకుల నిర్లక్ష్యపు అడుగుల కింద నలిగిపోతున్నాయి. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన విప్లవ వీరుడి జ్ఞాపకాలు అభివృద్ధికి నోచుకోక వెలవెలబోతున్నాయి. దశాబ్ద కాలంగా వింటున్న పర్యాటక కారిడార్ హామీలు ప్రకటనలకే పరిమితం కాగా, అల్లూరి చరిత్రను కళ్లకు కట్టాల్సిన స్మారక ప్రాంతాలు నేడు శిథిలావస్థకు చేరువవుతున్నాయి. మంప నుంచి రాజేంద్రపాలెం వరకు.. అధికారుల ఉదాసీనతకు సజీవ సాక్ష్యంగా మారుతున్న ఆ ప్రాంతాల దుస్థితిపై నేడు అల్లూరి వర్థంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
కొయ్యూరు: తెలుగుజాతి పౌరుషానికి ప్రతీక, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ పాలకులపై పోరాటం సాగించిన చారిత్రక ప్రాంతాలు నేడు పాలకుల, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. అల్లూరిని బ్రిటీష్ వారు బంధించిన మంప, ఆయనను కాల్చి చంపిన రాజేంద్రపాలెం వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ ఒక భారీ పర్యాటక కారిడార్ ఏర్పాటు చేస్తామని పాలకులు దశాబ్ద కాలంగా హామీలు ఇస్తున్నప్పటికీ, అవి నేటికీ కాగితాలకే పరిమితమయ్యాయి.
మంప పార్కు..: కేంద్ర సాంస్కృతిక శాఖ నిధులతో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో రెండేళ్ల క్రితం ఇక్కడ పనులు ప్రారంభమయ్యాయి. అల్లూరి స్నానం చేసే కొలనును ఆధునికీకరించి, చుట్టూ నడక దారిని ఏర్పాటు చేసినప్పటికీ పనులు పూర్తికాలేదు.
● అక్కడ ఉన్న స్మారక స్థూపంపై అల్లూరి జనన, మరణ వివరాలు కనీసం పొందుపరచలేదు. చరిత్రను వివరించేందుకు ఏర్పాటు చేసిన దృశ్య ఫలకాలు కూడా అసంపూర్తిగా ఉండటంతో పర్యాటకులకు సరైన సమాచారం అందడం లేదు. కనీసం చిన్న పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు.
రాజేంద్రపాలెంలో అదే తీరు : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా రాజేంద్రపాలెంలో అల్లూరితో పాటు ఆయన అనుచరులు గాం గంటన్నదొర, మల్లుదొర, బోనంగి పడాల్ విగ్రహాలను గత ప్రభుత్వంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర ఆవిష్కరించారు. అయితే, ఆ విగ్రహాల చుట్టూ పార్కును సుందరీకరించి, మొక్కలు నాటి నిర్వహించడంలో అధికారులు విఫలమయ్యారు. అల్లూరి తన పోరాట వ్యూహాలను రచించిన ఉర్లకొండ గుహ మంపలోని కొలనుకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఎత్తైన కొండపై ఉండటంతో పర్యాటకులను ఆకర్షించేందుకు ఇక్కడికి రోప్‌వే నిర్మించాలని ప్రతిపాదనలు నేటికీ ఆచరణకు నోచుకోలేదు.


