పరవాడ: మండలంలోని తిక్కవానిపాలెం తీరంలో ఈ నెల 4న గల్లంతైన పి.బోనంగి గ్రామానికి చెందిన కావూరి గురునాథరావు(19) మృతదేహం బుధవారం మధ్యాహ్నం తీరానికి చేరింది. మూడు రోజుల నుంచి మృతదేహం కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. తిక్కవానిపాలెం తీరంలో సముద్రంపై తేలియాడుతుండగా గుర్తించిన స్థానికులు మృతదేహన్ని బోట్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో అండమాన్ నుంచి వచ్చిన తన స్నేహితులను వెంటబెట్టుకుని తీరానికి చేరిన గురునాథరావు స్నానానికి సముద్రంలో దిగాడు. స్నానం చేస్తుండగా ఉధృతంగా వచ్చిన రాకాసి అలలు గురునాథరావును లోపలికి లాక్కుపోయాయి. ఈ ప్రమాదంలో గల్లంతైన యువకుడు మృతదేహంగా బుధవారం తీరానికి చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకును రాకాసి అలలు పొట్టన పెట్టుకోవడంతో తమకు దిక్కెవరని రోదిస్తున్న తల్లిని చూసి అక్కడున్నవారు కంటతడి పెట్టుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు.


