దహన ఖర్చులకు రూ.10 వేలు అందజేత
అల్లిపురం: నగరంలోని ఇసుకతోట వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 32వ వార్డుకు చెందిన యువకుడు మృతి చెందడంపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వార్డు అధ్యక్షుడు రాజారెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న ఆయన.. తక్షణమే స్పందించి మృతుడి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వాసుపల్లి.. మృతుడు కొండాపు రాజేష్ రెడ్డి అకాల మరణంతో అతని ఇద్దరు పిల్లలు అనాథలవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పిల్లల చదువుకు తాను పూర్తి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రాజేష్‌రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొని నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు కేవలం చలానాల వసూళ్లకే పరిమితమవుతున్నారని, రోడ్డు భద్రతను పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు.


