విశాఖ స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ యవనికపై మెరవాలన్నా లేదా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలన్నా ఏ క్రీడాకారుడికై నా జిల్లా స్థాయి పోటీలే తొలి మెట్టు. నేడు దేశవాళీ క్రికెట్‌లోకి ఎన్ని ప్రీమియర్ లీగ్‌లు వచ్చినా, ఒక ఆటగాడి ప్రమాణాలను నిర్ణయించేది మాత్రం జిల్లా స్థాయిలో నేర్చుకున్న ప్రాథమికాంశాలే. ఇక్కడే ఓనమాలు దిద్దిన క్రీడాకారులు క్రమంగా నార్త్ జోన్ స్థాయికి, ఆపై రంజీ ట్రోఫీకి అర్హత సాధిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏటా జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుత వేసవిలో క్రీడాకారుల సౌకర్యార్థం నాలుగు వేదికల్లో ఈ శిబిరాలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ స్టేడియాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని శిక్షణ ఇస్తుండగా, మున్సిపల్ స్టేడియం, గాజువాక వాసుల కోసం కొరమాండల్ గ్రౌండ్స్, గ్రామీణ ప్రాంత క్రీడాకారుల కోసం ఉక్కు స్టేడియం వేదికలుగా మారాయి. ఈ ఏడాది అండర్ 10, 12, 14, 16 విభాగాల్లో శిక్షణ కోసం ఏకంగా 1839 మంది దరఖాస్తు చేసుకోగా, నాలుగు వేదికల్లో నిర్వహించిన ఎంపికల ద్వారా 484 మందిని తుది శిక్షణకు ఎంపిక చేశారు. వీరిలో దాదాపు 50 మంది వరకు బాలికలు, మహిళా క్రీడాకారిణులు ఉండటం విశేషం.
ఈ శిబిరాల్లో క్రీడాకారులకు ప్రాథమిక స్థాయి నుంచి శిక్షణ అందిస్తున్నారు. బ్యాట్ గ్రిప్ పట్టుకోవడం నుంచి స్టాన్స్ వరకు, బంతిని పట్టుకోవడం నుంచి గింగిరాలు తిప్పే స్పిన్ మెళకువల వరకు నిష్ణాతులు నేర్పిస్తున్నారు. మీడియం పేస్ బౌలింగ్, స్పిన్, వికెట్ కీపింగ్ విభాగాల్లో ఇక్కడే పునాది పడుతుందని నిర్వాహక ప్రతినిధి డీఎస్. వర్మ తెలిపారు. అండర్–14 విభాగంలో దరఖాస్తు చేసుకున్న 600 మందిలో 130 మందిని, అండర్–16లో 358 మందిలో 122 మందిని ఎంపిక చేసి జిల్లా జట్టులోకి వెళ్లేలా తీర్చిదిద్దుతున్నారు. సాధారణంగా జిల్లా జట్టు ఎంపిక టోర్నీలు అండర్–14 నుంచే ప్రారంభమైనప్పటికీ, ముందుగానే క్రీడాకారులను సమాయత్తం చేయడానికి అండర్ 10, 12 విభాగాల్లోనూ శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి పార్థసారథి పేర్కొన్నారు. ప్రస్తుతం అండర్ 10లో 96 మందిని, అండర్ 12లో 136 మందిని ఎంపిక చేసి ప్రోత్సహిస్తున్నారు. ఎండ వేడి నుంచి క్రీడాకారులను రక్షించేందుకు రెండు సెషన్లలో శిక్షణ ఇస్తూ, శిబిరం చివర్లో నాలుగు గ్రూపులుగా విభజించి పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని ప్రాబబుల్స్‌గా ఎంపిక చేసి, భవిష్యత్తులో జిల్లా జట్టు ఎంపికలో వారికి ప్రాధాన్యత కల్పిస్తారు.


