పరవాడ: అనకాపల్లి–విశాఖ జాతీయ రహదారిపై లంకెలపాలెం కూడలిలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లంకెలపాలెం సమీపంలోని గంజిపేటకు చెందిన గుత్తుల శివపార్వతి (50) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే, శివపార్వతి తన వ్యక్తిగత పనుల నిమిత్తం గాజువాక వెళ్లి తిరిగి తన స్వగ్రామానికి చేరుకునే క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో లంకెలపాలెం కూడలిలో బస్సు దిగారు. అక్కడి నుంచి రోడ్డు దాటుతుండగా..గాజువాక వైపు నుంచి అనకాపల్లి వెళ్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్ ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త సత్యనారాయణ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేసి ఇటీవల పదవీ విరమణ పొందారు, వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆర్. మల్లికార్జునరావు తెలిపారు.


