విశాఖలో రూ. 3,200లకు చేరిన
మూడు నెలల్లో రూ.1300 వరకూ
పెరుగుదల
కుదేలవుతున్న హోటల్ రంగం
ఇప్పటికే మూతపడిన 25% చిన్న రెస్టారెంట్లు
మెనూ ధరల్ని 10–15% పెంచేసిన రెస్టారెంట్లు
సాక్షి, విశాఖపట్నం : పెరుగుతున్న వాణిజ్య సిలిండర్ల ధరలు నగరంలోని హోటల్ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. మూడు నెలల కాలంలోనే మూడుసార్లు ధరలు (మార్చిలో రూ.144, ఏప్రిల్‌లో సుమారు రూ.200 పెంచగా.. ఈసారి ఏకంగా రూ.993) పెరగడంతో నిర్వహణ భారం పెరిగి హోటల్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 30 నాటికి కమర్షియల్ సిలెండర్ ధర రూ.2,153 ఉండగా.. ప్రస్తుతం రూ.3,200 కి చేరుకుంది. దీని ప్రభావంతో హోటల్ రంగంపై కోలుకోలేని దెబ్బపడింది. పెరిగిన ముడిసరుకుల ధరలకు తోడు, గ్యాస్ భారం తోడవడంతో వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. ఒకవైపు నిత్యావసరాల ధరలు, మరోవైపు గ్యాస్ మంటతో లాభాలు రాక పెట్టుబడులు కూడా కోల్పోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఈ భారానికి తట్టుకోలేక ఇప్పటికే పలు చిరుహోటళ్లు మూతపడగా, వాటిని నమ్ముకున్న వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు.
ధరలు 10 నుంచి 15 శాతం పెంపు
సరైన సమయంలో స్టాక్ దొరక్క పోవడంతో ఈ మధ్య కాలంలో రూ.3 వేలకు బ్లాక్‌లో కొనుగోలు చేసేవాళ్లు. ఇప్పుడు వాస్తవ ధర రూ.3 వేలకు పైగా ఉండటంతో బ్లాక్‌లో రూ.4000 నుంచి రూ.4500 వరకూ పలుకుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిలెండర్ల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఆ భారాన్ని భరించేందుకు హోటల్ యజమానులు మెనూ ధరల మార్పుని ఎంచుకున్నారు. నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లు ఇప్పటికే తమ మెనూ ధరలను 10 నుంచి 15 శాతం వరకూ పెంచేశాయి.
మూతపడుతున్న చిన్న హోటల్స్
అసలే గ్యాస్ దొరక్క అష్టకష్టాలు పడుతున్న చిన్న చిన్న హోటల్స్ యజమానులు.. ఇప్పుడు ధర పెరగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని చిన్న హోటల్స్, ఫుడ్ కోర్టులు, టిఫిన్, మీల్స్ బండ్ల వ్యాపారుల పరిస్థితి దారుణంగా మారింది. సిలెండర్లు ఇంత ధర పెట్టి కొనుగోలు చేసినా వ్యాపారంలో నష్టాలే తప్ప లాభాలు వచ్చే అవకాశాలు లేవని భావించి.. చిన్న చిన్న హోటల్స్‌ని మూసేస్తున్నారు. ధర పెంచి అమ్మినా ప్రజలు తినేందుకు వచ్చే సూచనలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 25 శాతం వరకూ చిన్న చిన్న రెస్టారెంట్లు, బళ్లు మూతపడినట్లు తెలుస్తోంది.
రోడ్డున పడుతున్న కార్మికులు!
హోటళ్లు మూతపడుతుండటంతో మాస్టర్లు, సర్వర్లు, క్లీనర్లుగా పనిచేస్తున్న వేలాది మంది ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అటు హోటల్ యజమానులు ధరలు పెంచితే కస్టమర్లు తగ్గుతారని, పెంచకపోతే నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన ధరల వల్ల సామాన్యులు హోటల్ మెట్లెక్కాలంటేనే భయపడుతుండగా, మరోవైపు కొత్త పనులు దొరక్క కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కమర్షియల్ సిలిండర్ ధర
ఖర్చులు రెట్టింపయ్యాయి
గతంలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య సిలిండర్ ధర లు రూ.3వేల మార్కును దాట డం మా లాంటి హోటల్ నిర్వహకుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. గ్యాస్ ధరలే కాకుండా, నిత్యావసర సరుకులు, విద్యుత్ చార్జీలు కూడా తోడవడంతో రోజువారీ ఖర్చులు రెట్టింపయ్యాయి. కస్టమర్లపై భారం వేయకూడదని ఇన్నాళ్లూ ఓపిక పట్టినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో మెనూ ధరలు పెంచక తప్పడం లేదు. ధరలు పెంచితే కస్టమర్ల సంఖ్య తగ్గుతోంది, పెంచకపోతే నిర్వహణ భారమై నష్టాలు వస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సిబ్బందికి జీతాలు ఇవ్వడం కూడా కష్టమే. – రాజశేఖర్,
అతిథి దేవోభవ హోటల్ యజమాని


