మహారాణిపేట: ప్రభుత్వం పెన్షనర్లకు జనవరి 2026లో ప్రకటించిన డీఏ బకాయిలను ఎట్టకేలకు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గత నెల 16న ‘సాక్షి’ దినపత్రికలో ‘పెన్షనర్లకు మొండిచేయి’ శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించిన అధికార యంత్రాంగం, నిలిచిపోయిన నిధుల విడుదలకు చర్యలు చేపట్టింది. వివిధ సాంకేతిక కారణాల వల్ల సీతమ్మధార సబ్ ట్రెజరీ పరిధిలో సుమారు 13,500 మంది పెన్షనర్లకు ఈ ఏరియర్స్ చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి సంబంధించిన బిల్లులు తాజాగా రాష్ట్ర ఖజానా శాఖ నుంచి సీతమ్మధార ఉప ఖజానాకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ బిల్లుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని, బుధవారం తర్వాత ఈ నిధులను నేరుగా పింఛన్‌దారుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని జిల్లా ట్రెజరీ అధికారి ఎం. మోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. పెన్షనర్లు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.


