టీవీకే గెలుపు చంద్రబాబుకు షాక్.. జగన్‌మోహన్‌రెడ్డి గెలుపునకు ఇదే నాంది విజయ్ గెలుపుతో వాసుపల్లి సంబరాలు అడ్డుకున్న పోలీసులు
డాబాగార్డెన్స్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘనవిజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంపై దక్షిణ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో జగదాంబ జంక్షన్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద 29వ వార్డు అధ్యక్షుడు పీతల వాసు ఆధ్వర్యంలో, అలాగే పూర్ణా మార్కెట్ వద్ద 35వ వార్డు అధ్యక్షుడు అలపున కనకరెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు బాణసంచా కాల్చి, కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ.. తమిళనాడు ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి, విజయ్ కలిసి ఉన్న ఫొటో చూసి అక్కడి తెలుగు వారు టీవీకే పార్టీకి ఓటు వేసి అత్యధిక స్థానాల్లో గెలిపించారని పేర్కొన్నారు. ఎవరితోనూ పొత్తులు లేకుండా, కేవలం తమ బలాన్నే నమ్ముకుని సింగిల్‌గా పోటీ చేసి గెలిచిన మొనగాళ్లు జగన్, విజయ్ మాత్రమేనని కొనియాడారు. వారిద్దరి చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ.. ‘సింగిల్ ఇంజన్’ పవర్ ఏంటో తమిళనాడు ప్రజలు చూపించారని, డబుల్ ఇంజన్ అంటూ అక్కడికి వెళ్లిన చంద్రబాబుకు ప్రజలు మొహం చాటేశారని ఎద్దేవా చేశారు. ఏపీలో కూడా 2029 ఎన్నికల్లో ఇదే ఫలితం పునరావృతమవుతుందని, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భారీ విజయంతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. 2027లో జగన్ చేపట్టబోయే పాదయాత్రలో ప్రతిరోజూ కూటమి ప్రభుత్వానికి సినిమా చూపిస్తారని హెచ్చరించారు. 1000 వాలా టపాకాయలు కాలిస్తే రచ్చ చేయడం హాస్యాస్పదమని, పోలీసులు కూటమి నేతలకు కొమ్ముకాయడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా ధనాన్ని విపరీతంగా దుబారా చేస్తోందని వాసుపల్లి మండిపడ్డారు. అమరావతిలో కేవలం అద్దాల మేడ కోసమే రూ. 2,900 కోట్లు ఖర్చు చేయడం దారుణమని, ప్రతి రూపాయికి చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


