కోచ్‌ మెయింటెనెన్స్‌ డిపో @ జగన్నాథపురం | - | Sakshi
Sakshi News home page

కోచ్‌ మెయింటెనెన్స్‌ డిపో @ జగన్నాథపురం

May 4 2026 10:25 AM | Updated on May 4 2026 10:25 AM

పాత రైల్వే స్టేషన్‌ ప్రాంతాన్ని నవీకరించనున్న రైల్వే శాఖ

118 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు

వందేభారత్‌, అమృత్‌ భారత్‌ రైళ్ల నిర్వహణ ఇక్కడే చేపట్టేలా చర్యలు

ఈ డిపో అనకాపల్లి, సబ్బవరం ప్రాంతాలకు అనుసంధానం

ఇందుకోసం ప్రత్యేక మార్గాల ఏర్పాటుకు సన్నాహాలు

కొత్త మార్గం కోసం 115 ఎకరాలు అవసరమని గుర్తించిన అధికారులు

ఇందులో కొంత ప్రభుత్వ భూమి ఉండగా.. మిగిలింది సమీకరించే ప్రతిపాదన

సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు అడుగులు పడుతున్న నేపథ్యంలో.. కొత్తగా ఏర్పడనున్న విశాఖ డివిజన్‌లో కొత్త ప్రాజెక్టులపై రైల్వే బోర్డు సన్నద్ధమవుతోంది. వందేభారత్‌, అమృత్‌భారత్‌ రైళ్ల సర్వీసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వహణ డిపోలు దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా విశాఖలోనూ ఓ కోచ్‌ మెయింటెనెన్స్‌ డిపో కూడా రాబోతోంది. రూ.వందల కోట్లతో షెడ్‌ల నిర్మాణానికి అనువైన స్థలం గుర్తించారు. విశాఖ వన్‌ టౌన్‌ సమీపంలోని పాత రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో కోచ్‌ మెయింటెనెన్స్‌ డిపో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ డిపోని అనకాపల్లి, సబ్బవరం ప్రాంతాలకు అనుసంధానం చేసేలా కొత్త లైన్లు ఏర్పాటుకూ రంగం సిద్ధం చేస్తున్నారు.

భారతీయ రైల్వే వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన వందేభారత్‌, అమృత్‌ భారత్‌ రైలు సర్వీసులకు ఆదరణ గణనీయంగా పెరుగుతూ వస్తోంది. సౌకర్యవంతంగా.. సదుపాయాలతో కూడిన వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న ఈ రైళ్లకు క్రమంగా డిమాండ్‌ పెరుగుతోంది. విశాఖ నుంచి రెండు వందేభారత్‌లు, ఒక అమృత్‌ భారత్‌ రైలు సర్వీసులు నడుస్తున్నాయి. త్వరలోనే తిరుపతికి కూడా వందేభారత్‌ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్‌ రాబోతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ఈ రెండు రైళ్ల సర్వీసులు మరిన్ని పెరగనున్నాయి. అందుకే విశాఖలో ఈ రైళ్ల నిర్వహణ కోసం మెయింటెనెన్స్‌ డిపో ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు భావిస్తోంది. రెండున్నరేళ్ల క్రితం వందేభారత్‌ మెయింటెనెన్స్‌ డిపో వైజాగ్‌లో నిర్మించాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. ఆ తర్వాత అధికారులు దీనిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు జోన్‌ ప్రక్రియ వేగవంతం కావడంతో.. మరోసారి ప్రాజెక్టు తెరపైకి వచ్చింది.

అనకాపల్లి, సబ్బవరం వరకూ అనుసంధానం

ఈ కోచ్‌ డిపో నుంచి అనకాపల్లి మీదుగా సబ్బవరం లైన్లకు అనుసంధానించ నున్నారు. దీనివల్ల అటువైపు వెళ్లే రైళ్లని ఇటుగా మళ్లించేందుకు వీలవుతుంది. రైల్వే స్టేషన్‌ నుంచి కోచ్‌ మెయింటెనెన్స్‌ డిపో మీదుగా వెళ్తే ప్రధాన స్టేషన్‌పై ట్రాఫిక్‌ భారం కూడా తగ్గనుంది. ఈ కనెక్టివిటీ కోసం కొత్త లైన్లు వేయనున్నారు. దీనికి సంబంధించిన సర్వే కూడా పూర్తి చేశారు. ఈ కనెక్టివిటీ నెట్‌వర్క్‌ కోసం సుమారు 115 ఎకరాలు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. ఈ లైన్లు వెళ్లే మార్గంలో 40 శాతం వరకూ ప్రభుత్వ భూములున్నాయి. మిగిలిన భూముల్ని సమీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నెట్‌వర్క్‌ బలోపేతమయ్యేలా..

వందేభారత్‌, అమృత్‌భారత్‌ రైళ్ల మెయింటెనెన్స్‌ కోసం, డిపోలు, నిర్వహణ కార్యక్రమాల్ని దేశ వ్యాప్తంగా చేపడుతున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న దక్షిణకోస్తా జోన్‌లో విశాఖలో డిపో రానుంది. ఈ కోచ్‌ డిపోలో ఈ రైళ్లను నిలిపి ఉంచుతారు. ఈ రైళ్లలో ఇన్‌స్పెక్షన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ టేబుల్స్‌ నిర్వహిస్తారు. ఈ టేబుల్స్‌లో, పర్‌ఫార్మెన్స్‌ టెస్ట్‌లు, ప్రివెంటివ్‌ మెయింటెనెన్స్‌ ప్రొసీజర్‌ల వివరాలు ఉంటాయి. వందేభారత్‌ రైళ్ల కోసం, ట్రాక్షన్‌, ప్రధాన ఎలక్ట్రికల్‌ ఎక్విప్‌మెంట్‌లకు ప్రివెంటివ్‌, కరెక్టివ్‌ మెయింటెనెన్స్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఇక్కడ రాబోతున్న డిపోలో రన్నింగ్‌ మెయింటెనెన్స్‌ బేలో ట్రిప్‌ షెడ్యూల్‌లు లేదా వీక్లీ షెడ్యూల్‌లు వంటి కార్యాచరణ నిర్వహణ కోసం సౌకర్యాలు కల్పిస్తారు. ఇందులో అండర్‌ గేర్‌, ఓవర్‌ హెడ్‌ పరికరాలు, ఇంటీరియర్‌లను తనిఖీ చేయడం, వాషింగ్‌, క్లీనింగ్‌, బ్రేక్‌ సిస్టమ్‌లు, డ్రాఫ్ట్‌ గేర్‌ (కప్లర్లు), ఎయిర్‌ కండిషనింగ్‌, ఇతర ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ సబ్‌సిస్టమ్‌ల మరమ్మతుల సౌకర్యాల్ని ఇక్కడ నుంచి నిర్వహించే అవకాశం ఉంది. ఒకేసారి 10 కిపైగా రైళ్లని ఇక్కడ మెయింటెనెన్స్‌ చేసేలా నిర్మాణం ఉండబోతుందని వాల్తేరు వర్గాలు చెబుతున్నాయి. ఈ మెగా డిపో ఏర్పాటుతో స్థానికంగా భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విశాఖను దక్షిణ మధ్య రైల్వేలో అతిపెద్ద రైల్వే కార్యకలాపాల కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంలో భాగంగానే ఈ ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.

త్వరలో డీపీఆర్‌

కోచ్‌ మెయింటెనెన్స్‌ డిపో ఏర్పాటుకు అప్పట్లో స్థల పరిశీలన చేశారు. రైల్‌ ట్రాక్‌ కనెక్టివిటీ ఉన్న ఖాళీ స్థలాల్ని అధికారులు పరిశీలించారు. తొలుత వడ్లపూడిలోని వ్యాగన్‌ వర్క్‌షాప్‌ పక్కన నిర్మించాలని భావించారు. అయితే రైలు వైజాగ్‌ స్టేషన్‌ నుంచి అక్కడికి వెళ్లి తిరిగి వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. అదే సమయంలో స్టేషన్‌కు రావాలంటే అవుటర్‌లో ఖాళీ లేకపోతే గంటల తరబడి వేచి ఉండాలి. దీంతో నిర్దిష్ట సమయానికి కొన్ని సార్లు నడపడం వీలవదు. ఈ సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నం పాత రైల్వే స్టేషన్‌ని ఎంపిక చేశారు. విశాఖ రైల్వే స్టేషన్‌కు దాదాపు 2 కిమీ దూరంలో ఈ ప్రాంతం ఉంది. ప్రస్తుతం అక్కడ వరకూ ఉన్న ట్రాక్‌లు, స్థలం కలిపి మొత్తం సుమారు 118 ఎకరాల వరకూ విస్తీర్ణం ఉంది. డిపో నిర్మాణ సమయంలో పాత ట్రాక్‌లను అనుసంధానం చేస్తే పని సులువవుతుంది. అందుకే ఈ ప్రాంతాన్ని కోచ్‌ మెయింటెనెన్స్‌ డిపో నిర్మాణ స్థలంగా ఎంపిక చేశారు. త్వరలోనే డీపీఆర్‌ సిద్ధం చేసి అనుమతుల కోసం రైల్వే బోర్డుకు పంపించనున్నట్లు వాల్తేరు డివిజన్‌ అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement