పెన్షన్ల తొలగింపుపై ‘కూటమి’ కక్ష సాధింపు
బాధితుల ఫిర్యాదులతోవెలుగులోకి వ్యవహారం
సచివాలయం ఉద్యోగులనుబలి చేసే కుట్ర
జిల్లాలో 90 మంది వృద్ధులు, వలసదారుల పెన్షన్లు తొలగింపు
ప్రభుత్వం చెప్పిందనేఆ పనిచేసినట్లు వెల్లడి
పింఛను రావట్లేదంటూ జీవీఎంసీ కమిషనర్‌కు బాధితుల ఫిర్యాదు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల వేళ పింఛన్లు పెంచుతామని ఆకాశానికి నిచ్చెనలు వేసిన చంద్రబాబు, అధికారం దక్కగానే పెన్షన్ల కోత విధిస్తూ అవ్వాతాతల నోటికాడ బువ్వను లాగేసుకుంటున్నారు. జిల్లాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులను ఏరివేయాలనే కుట్రతో, ఏకంగా బతికున్నవారిని రికార్డుల్లో చనిపోయినట్లు చూపిస్తూ పేదల కడుపు కొడుతున్నారు. పింఛన్ల తొలగింపు జాబితాల్లో తమ ప్రమేయం లేదని, ఈ పాపంలో తమను భాగస్వాములను చేయవద్దని ఇటీవల కొంతమంది సచివాలయ సిబ్బంది జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. –మహారాణిపేట
జిల్లాలో సుమారు 90 మంది లబ్ధిదారుల పింఛన్లను అత్యంత అన్యాయంగా తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. బాధితులు కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌ను కలిసి ‘మేము బతికే ఉన్నాం’ అని మొరపెట్టుకోవడంతో ప్రభుత్వ భాగోతం వెలుగులోకి వచ్చింది. బతికున్నవారిని మరణించినట్టుగా..వలస వెళ్లినట్లుగా చిత్రించి జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఖజానాపై భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకే ఈ ప్రక్రియ సాగుతుండగా, రేపు ఏదైనా విచారణ జరిగితే కింది స్థాయి సిబ్బందిని బలిపశువులను చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
రాజకీయ కక్షసాధింపులే లక్ష్యం
2014 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో సాగిన పింఛన్ల వేటు, ఇప్పుడు మళ్లీ అదే తరహాలో పునరావృతమవుతోంది. రాజకీయ కక్షసాధింపులో భాగంగా తమకు అనుకూలంగా లేని వారిని గుర్తించి ఏరివేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.జిల్లాలో గత మార్చి నెలలో 1,65,891 గా ఉన్న పింఛన్ల సంఖ్య, మే నెల నాటికి 1,57,914కు పడిపోయింది. అంటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే సుమారు 1700 మందికి పైగా లబ్ధిదారులు పింఛన్లకు దూరమయ్యారు.
ఆందోళనలో వృద్ధులు
ప్రభుత్వం చేపట్టిన ఈ పునఃపరిశీలన ప్రక్రియ అభాగ్యుల పాలిట శాపంగా మారింది. శారీరక ఇబ్బందులతో మంచానికే పరిమితమైన వృద్ధులను సైతం ధృవీకరణ పత్రాల పేరుతో వేధిస్తుండటంతో వృద్ధులు, వితంతువులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తమ పింఛన్ ఎందుకు ఆగిపోయిందో అడిగితే సమాధానం చెప్పే నాథుడే కరువయ్యారు. అధికారుల చుట్టూ తిరగలేక, అటు ఆర్థిక ఆసరా లేక అనేక కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. బాధితుల ఫిర్యాదులతో జీవీఎంసీ కమిషనర్ విచారణకు ఆదేశించినప్పటికీ, సిబ్బందిపై చర్యలు తీసుకుని ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతోంది.


