కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలకు అక్రమ కేసులే నిదర్శనం | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలకు అక్రమ కేసులే నిదర్శనం

May 4 2026 10:25 AM | Updated on May 4 2026 10:25 AM

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ● పూడి శ్రీహరికి ఘన స్వాగతం

మహారాణిపేట: ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖ జర్నలిస్టు, బీసీ వర్గ నేత, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేయడం కూటమి ప్రభుత్వ దౌర్జన్యానికి పరాకాష్ట అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో బెయిల్‌పై విడుదలై తన నివాసానికి విచ్చేస్తున్న పూడి శ్రీహరికి ఆదివారం విశాఖ విమానాశ్రయంలో కేకే రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి విమర్శలను అణచివేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇలాంటి వేధింపులకు పాల్పడుతోందని ఖండించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనూ, సంక్షేమ పథకాలను అమలు చేయడంలోనూ పూర్తిగా విఫలమైన ప్రభుత్వం, కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు. అనంతరం పూడి శ్రీహరి మాట్లాడుతూ.. మహాభారతంలో శ్రీకృష్ణుడు రాజ్యాన్ని, ప్రజలను కాపాడినట్లే.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని, పార్టీని కాపాడగల ఏకై క నాయకుడని విశ్వాసం వ్యక్తం చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టినందుకు వ్యక్తిగతంగా బాధలేదని, జర్నలిస్టులనే లక్ష్యంగా చేసుకోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. సామాన్య వ్యక్తులకు రాజకీయాల్లో అత్యున్నత అవకాశాలు కల్పించిన ఘనత జగన్‌దేనని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఆయన చేసిన సంస్కరణలు మరువలేనివని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇదే తీరును కొనసాగిస్తే రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్‌ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్‌ కట్టమూరు సతీష్‌, పార్టీ నాయకులు కొండా రాజీవ్‌ గాంధీ, అల్లు శంకరరావు, అంబటి శైలేష్‌, మనోజు, జీలకర్ర నాగేంద్ర, గోద్దేశి శ్రీనివాస్‌ రెడ్డి, రవికుమార్‌, వేణుగోపాలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement