భవనం పైకి లేపుతుండగా ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

భవనం పైకి లేపుతుండగా ప్రమాదం

May 4 2026 10:25 AM | Updated on May 4 2026 10:25 AM

● వ్యక్తి మృతి..ముగ్గురికి గాయాలు ● వికాస్‌నగర్‌లో విషాదం

పెదగంట్యాడ: నిన్నటి వరకూ నలుగురు కలిసి నవ్వుతూ గడిపిన ఆ ఇల్లు.. ఒక్కసారిగా మృత్యు కుహరంగా మారింది. దుకాణాన్ని కాపాడుకోవాలని కాస్త ఎత్తు పెంచే ఓ కుటుంబ ఆశలు, మరో కుటుంబ భవిష్యత్తును శిథిలాల కింద సమాధి చేసేశాయి. మండలంలోని వికాస్‌నగర్‌లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. వికాస్‌నగర్‌ హెచ్‌ఐజీ–7లో నివసిస్తున్న జయప్రకాష్‌కు చెందిన 20 ఏళ్ల పాత దుకాణం రోడ్డు కంటే తక్కువ ఎత్తులో ఉంది. దీంతో ఆ భవనాన్ని హైడ్రా జాకీల సాయంతో పైకి లేపేందుకు కాంట్రాక్టర్‌ ప్రసాద్‌తో రూ.1.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ పనుల కోసం గాజువాక నుంచి వచ్చిన ఏడుగురు కూలీలు ఆదివారం ఉదయం 12 జాకీలను బిగించి భవనాన్ని కొంతమేర పైకి లేపారు. సాయంత్రం పని ముగించుకుని వారంతా చేతులు కడుక్కుంటున్న సమయంలో భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో గాజువాకకు చెందిన నాగరాజు (34) అనే కార్మికుడు శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న న్యూపోర్ట్‌ సీఐ టి.కామేశ్వరరావు తన సిబ్బంది, రెస్క్యూ బృందంతో హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కూలీలందరూ మార్కెట్‌ నుంచి వచ్చిన వారు కావడంతో వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని సీఐ తెలిపారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన దేవన్‌ రెడ్డి

భవనం కుప్పకూలిన విషయం తెలియగానే వైఎస్సార్‌ సీపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పోలీసులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందిన నాగరాజు

Advertisement
 
Advertisement
Advertisement