ఏయూక్యాంపస్: సమాజంలో శాంతియుత జీవనం, మానవత్వమే లక్ష్యంగా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ రిలీజియస్ ఫ్రీడమ్ , యునైటెడ్ రిలీజియన్స్ ఇనీషియేటివ్, గాంధీ సెంటర్, అప్ హోల్డ్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బీచ్‌రోడ్డులో ‘శాంతి నడక’ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గాంధీ సెంటర్ అధ్యక్షులు ఆచార్య వి.బలమోహన్ దాస్, ఐఏఆర్‌ఎఫ్ చైర్మన్ నరవ ప్రకాశరావు జెండా ఊపి ప్రారంభించారు. యూత్ హాస్టల్ వద్ద ప్రారంభమైన ఈ నడక సబ్‌మైరెన్ మ్యూజియం వరకు సాగింది. అనంతరం తిరిగి యూత్ హాస్టల్ వద్దకు చేరుకుని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఆచార్య బలమోహన్ దాస్ మాట్లాడుతూ.. మత నమ్మకాలు ఎన్ని ఉన్నా మానవత్వం ఒక్కటేనని, పరస్పర గౌరవంతో కలిసి జీవించినప్పుడే శాంతియుత సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుమారు వంద మందికి పైగా విభిన్న మతాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రహ్మకుమారి సంస్థ నుంచి రామేశ్వరి, రెవరెండ్ ప్రసాద్, ముస్లిం నాయకులు సూసోడియా, బుద్ధిస్ట్ వేణుగోపాల రావు, గాంధీ సెంటర్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కె.ఎస్.ఎన్.మూర్తి, ఎస్.కె. జైన్, అప్ హోల్డ్ ప్రతినిధి డేవిడ్ రాజు, మానవ హక్కుల కార్యకర్త బి.చిన్నారావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విశాలాక్షి, అనురాధ, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.


