హైకోర్టు న్యాయమూర్తులకు వినతి
అల్లిపురం: భీమిలిలో నూతనంగా ఏర్పాటు చేసిన కోర్టు పరిధిలోకి నగరానికి సమీపంలో ఉన్న ప్రాంతాలను చేర్చడం వల్ల న్యాయవాదులకు, కక్షిదారులకు వ్యయప్రయాసలు ఎదురవుతాయని, కాబట్టి వాటిని జిల్లా కోర్టు పరిధిలోనే కొనసాగించాలని విశాఖ బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఆదివారం భీమిలిలో సివిల్ కోర్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ రవి చీమలపాటిలను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు, కార్యదర్శి సుధాకర్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. షీలానగర్ నుంచి ఎన్‌ఏడీ కొత్తరోడ్డు, ఆరిలోవ, సాగర్ నగర్, విశాలాక్షి నగర్, పెందుర్తి వంటి ప్రాంతాలన్నీ ప్రస్తుతం భీమిలి కోర్టు పరిధిలోకి వెళ్లాయని, ఇవన్నీ నగరానికి అత్యంత సమీపంలో ఉన్నందున వీటిని విశాఖ కోర్టు పరిధి లోనే ఉంచాలని వారు కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తులు.. న్యాయవాదులకు, ప్రజలకు అనుకూలంగా ఉండేలా పరిధి నిర్ణయంలో మార్పులు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారని అధ్యక్షుడు సన్యాసిరావు తెలిపారు.


