సులభమనుకున్న తెలుగులోనే సున్నా..
ఆరిలోవ: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జిల్లా 89.51 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచింది. అయితే అందరినీ విస్మయానికి గురిచేస్తూ అత్యధిక మంది విద్యార్థులు మాతృభాష తెలుగులోనే తప్పడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు హాజరైన 28,929 మంది విద్యార్థుల్లో 25,894 మంది ఉత్తీర్ణులయ్యారు. మిగిలిన 3,035 మంది విద్యార్థులు ఫైయిల్ అయ్యారు. అన్ని సబ్జెక్టులలోను ఫెయిల్ అయిన విద్యార్థులున్నారు. వారిలో ఎక్కువమంది విద్యార్థులు తెలుగు పరీక్ష తప్పడం విశేషం. సాధారణంగా తెలుగును అత్యంత సులువైన సబ్జెక్టుగా భావించి విద్యార్థులు నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఉపాధ్యాయులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇతర సబ్జెక్టులపై చూపే శ్రద్ధను తెలుగుపై చూపకపోవడం, మాతృభాష పట్ల పెరుగుతున్న ఉదాసీనత ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఆంగ్లం, హిందీ వంటి ఇతర భాషల్లో తక్కువ మంది విద్యార్థులు తప్పినప్పటికీ, సొంత భాషలోనే అత్యధికులు వెనుకబడటం భాషాభిమానులను ఆలోచనలో పడేస్తోంది. తెలుగు భాషా బోధనలో మార్పులు రావాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు నొక్కి చెబుతున్నాయి.


