పిల్లల్ని ఎత్తుకుపోతున్నాడనే అనుమానంతో..
ఆరిలోవ: జీవీఎంసీ 10వ వార్డు పరిధి రవీంద్రనగర్‌లో ఆదివారం ఓ వ్యక్తి పిల్లలను ఎత్తుకుపోతున్నాడనే వార్త కలకలం రేపింది. స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని, అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని పట్టుకున్నారు. అప్పటికే ఆ వ్యక్తి అక్కడున్న ఇద్దరు పిల్లలకు చేగోడీలు, బిసెట్లు ఇస్తూ కనిపించడంతో స్థానికుల అనుమానం బలపడింది. ఆ వ్యక్తిని వివరాలు అడగగా, అతను సరైన సమాధానాలు చెప్పలేకపోయాడు. దీంతో పిల్లలను ఎత్తుకుపోవడానికి వచ్చాడని భావించిన కొందరు అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఆరిలోవ పోలీసులకు సమాచారం ఇచ్చి, అతన్ని అప్పగించారు. పోలీసులు అతడిని విచారించగా, సదరు వ్యక్తి మతిస్థిమితం లేని వాడిగా గుర్తించారు. మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్ల ఆ వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదని ఎస్‌ఐ కృష్ణ తెలిపారు.


