ప్రశాంతంగా నీట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నీట్‌

May 4 2026 10:25 AM | Updated on May 4 2026 10:25 AM

మహారాణిపేట: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌–2026) జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, 98.46 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 8,112 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా.. వారిలో 7,987 మంది పరీక్ష రాశారు. 125 మంది మాత్రమే గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలన్నింటినీ పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల నిఘాలో ఉంచి పర్యవేక్షించారు.

ఉదయం నుంచే విద్యార్థుల సందడి

పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరిగింది. అయితే ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ట్రాఫిక్‌ లేదా ఇతర ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఉరుకులు పరుగులతో సెంటర్లకు వచ్చారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేయడంతో విద్యార్థులు సకాలంలో చేరుకున్నారు. తెలుగు, హిందీ, ఆంగ్లంతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో విద్యార్థులు ఈ పరీక్షను రాశారు. ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీతో పాటు, 104 ఏరియాలోని కేంద్రీయ విద్యాలయం(1), కేంద్రీయ విద్యాలయం(2) తదితర కేంద్రాల వద్ద విద్యార్థులు క్యూల్లో బారులుదీరారు.

కఠిన నిబంధనలు అమలు

నీట్‌ నిబంధనల ప్రకారం పరీక్ష కేంద్రాల వద్ద సిబ్బంది కఠిన తనిఖీలు చేపట్టారు. లోపలికి ఎలాంటి ఆభరణాలను అనుమతించలేదు. దీంతో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినులు తమ చెవి దుద్దులు, ముక్కు పుడకలు, చేతి వాచీలు, కాళ్ల పట్టీలను సెంటర్ల బయటే తొలగించి తమ తల్లిదండ్రులకు అందజేశారు. కనీసం తలకు ఉన్న క్లిప్పులను సైతం తీయించేయడంతో విద్యార్థినులు జుట్టు విరబోసుకుని పరీక్షకు హాజరుకావాల్సి వచ్చింది. పరీక్ష కేంద్రంలోకి వెళ్లే ముందు పలువురు విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం కనిపించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా పరీక్ష ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసిందని అధికారులు వెల్లడించారు.

98.46 శాతం మంది హాజరు

Advertisement
 
Advertisement
Advertisement